
పైన పటారం.. లోన లొటారం..!
ఒంగోలు సబర్బన్:
జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో అధికార టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర దేవదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశంలో అధికారుల తీరుపై చిందులు తొక్కారు. పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా నడుస్తున్న కూటమి ప్రభుత్వ పాలనను టీడీపీ ప్రజాప్రతినిధులే ఎండగట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మండిపడిన మాగుంట...
సీఎంతో మాట్లాడి జిల్లాకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ వర్కులు తీసుకొస్తే కనీసం ఎంపీడీవోలతో మాట్లాడి ప్రొసీడింగ్స్ కూడా ఇప్పించలేని పరిస్థితిలో జిల్లా అధికార యంత్రాంగం ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమావేశంలో ధ్వజమెత్తారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సమీక్ష సమావేశాల్లో చర్చించిన అంశాలను కూడా పూర్తి చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చినా జిల్లా అధికారులు స్పందించడం లేదంటే ఏమనుకోవాలన్నారు.
వైద్యారోగ్య శాఖాధికారుల తీరుపై
అసహనం...
పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు మంచినీటి సమస్యపై, వైద్యారోగ్య శాఖాధికారుల తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో వైద్యారోగ్య శాఖ అధికారులపై సభ్యులందరూ అసంతృప్తి చెందడంతో ఆ శాఖపై 24 గంటల్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఇన్‌చార్జ్ మంత్రి ఆనం ఆదేశించారు. దీనిపై అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని గట్టిగా చెప్పారు. తొలుత ఉపాధి హామీ పథకం ద్వారా అమలవుతున్న పనుల పురోగతిపై చర్చించారు. జిల్లాలోని 17 మండలాల్లో కరువు ఉందని అధికారులు నివేదికలు ఇచ్చారని, ఆ ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి సమగ్ర ప్రణాళికతో జిల్లా యంత్రాంగం ముందుకు సాగాలని ఆదేశించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
విచారణ పేరుతో
కాలయాపన చేస్తున్నారంటూ ధ్వజం...
గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను 93 శాతం పరిష్కరించామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలపగా, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కొన్ని అర్జీలు చూపిస్తూ.. ఇవన్నీ పరిష్కారం కాలేదని అన్నారు. అంటే ఇవి మీ దగ్గర నమోదు కాలేదా.. అని ప్రశ్నించారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కల్పించుకుని మాట్లాడుతూ సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో ఒక సర్వే నంబర్ కోసం మొత్తం రిజస్ట్రేషన్లు ఆపేశారని, ఎన్నిసార్లు అర్జీలిచ్చినా పరిష్కారం కాలేదని అన్నారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. డీఆర్‌సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్‌లకు నివాళులర్పిస్తూ మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌రావు, కందుల నారాయణరెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, బీఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఏపీ మాల వెల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పి.విజయకుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డీఆర్‌సీ సమావేశం సాక్షిగా బయటపడిన లుకలుకలు
అధికారులు – ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం
ప్రభుత్వ లక్ష్యాలను పట్టించుకోవడం లేదు..
అధికారులపై ప్రజాప్రతినిధుల అసహనం
ఎన్‌ఆర్‌ఈజీఎస్ వర్కులకు ప్రొసీడింగ్స్ ఇప్పించకపోవడంపై ఎంపీ మాగుంట అసంతృప్తి
గ్రీవెన్స్ అర్జీల పెండింగ్‌పై కలెక్టర్‌ను ప్రశ్నించిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల
వైద్యారోగ్య శాఖాధికారులపై ఇన్‌చార్జ్ మంత్రి ఆనం ధ్వజం
అమృత్ పథకం పనులు పూర్తి చేయాలన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి
వై.పాలెం నియోజకవర్గంలో అక్రమాలపై ఆగ్రహించిన ఎమ్మెల్యే తాటిపర్తి
ఆర్ధోపెడిక్ లేక మరణాలు సంభవిస్తున్నాయి
డీఆర్‌సీ సమావేశంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని 100 పడకల వైద్యశాలలో ఆర్ధోపెడిక్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాదాలకు గురైన వారు మరణిస్తున్నారు. ఆర్ధోపెడిక్ డాక్టర్ గిద్దలూరు నుంచి వస్తారు. ఎప్పుడు వస్తారో తెలియదు. ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురై వైద్యశాలకు వస్తే ఆర్ధోపెడిక్ డాక్టర్ లేక రక్తం పోకుండా ఆపి కట్టుకట్టేవారు కూడా లేక నరసరావుపేట వైద్యశాలకు వెళ్లేలోపు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గురిజేపల్లికి చెందిన వెన్నా వెంకటేశ్వరరెడ్డి, ఫారిన్ వెళ్లాల్సిన తొమ్మండ్రు దిలీప్ కుమార్, మూడు రోజుల క్రితం ఒక కానిస్టేబుల్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇకపోతే, మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంచినీరు తోలిన ట్యాంకర్లకు ఇంత వరకు డబ్బు చెల్లించలేదు. రూ.13 కోట్ల బకాయిలున్నాయి. తీవ్ర కరువు కాటకాలతో ఉన్న యర్రగొండపాలేన్ని అధికారులు తీవ్రంగా విస్మరిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో వారానికి రూ.3 కోట్లు దండుకుంటున్నారు. టీడీపీ నాయకులు, అధికారులు పంచుకుంటున్నారు. రైతుల కోసం నిర్మిస్తున్న తొట్లు, షెడ్లలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోంది. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో సర్పంచుల తీర్మానాలు లేకుండా ఉపాధి పనులు చేపట్టారు. గతంలో ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని రవాణా చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
లక్ష్యం మేరకు జిల్లాలో ఎక్కడా పనులు జరగడం లేదు. ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు. ప్రజలకు అవసరమైన పనులేమీ చేయడం లేదు. కానీ, అంతా అద్భుతంగా చేస్తున్నట్లు అటు ప్రజాప్రతినిధులు.. ఇటు అధికారులు ఏడాది కాలంగా డప్పుకొట్టుకుంటూ వస్తున్నారు. ఇదంతా జిల్లా సమీక్ష కమిటీ సమావేశం సాక్షిగా బయటపడింది. అధికారుల పనితీరుపై కూటమి ప్రజాప్రతినిధులే ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి మధ్య సమన్వయలోపంతో అడుగడుగునా అసహనానికి గురయ్యారు. అధికారులపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పకనే చెప్పారు.

పైన పటారం.. లోన లొటారం..!