సమస్యలపై కాలయాపన తగదు | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై కాలయాపన తగదు

May 13 2025 2:05 AM | Updated on May 13 2025 2:05 AM

సమస్యలపై కాలయాపన తగదు

సమస్యలపై కాలయాపన తగదు

ఒంగోలు సిటీ: పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పునర్వ్యవస్థీకరణ ప్రక్రియతో పాటు ఏ విధమైన స్పష్టమైన జీవోలు లేకుండానే రోజుకో ఆలోచనతో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరాన్ని ప్రారంభించిన కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ వారం వారం గుర్తింపు కలిగిన ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహిస్తున్న సమావేశాల దృష్టికి సమస్యలు తెస్తున్నప్పటికీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయుల్లో చెలరేగుతున్న ఆందోళన నేపథ్యంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. జీవో నంబర్‌ 117ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త జీవో విడుదల చేసి దాని ఆధారంగా మాత్రమే పాఠశాలలను పునర్వ్యవస్థీకరించాలన్నారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలన్నారు. అన్ని మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో 5 తరగతులు బోధించడానికి ఐదుగురు టీచర్లను నియమించాలన్నారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎస్‌హెచ్‌ఎం పోస్టు అదనంగా కేటాయించాలని, అలాగే విద్యార్థుల సంఖ్య 120కి మించితే 6వ ఎస్‌జీటీ, ఆపైన ప్రతి 30 మందికి ఒక ఎస్‌జీటీ చొప్పున కేటాయించాలని అన్నారు. ఉర్దూ, మైనర్‌ మీడియం బోధించే ఉపాధ్యాయులను తెలుగు మీడియం ఎస్‌జీటీ/ఎస్‌ఏలతో కలిపి లెక్కించి పోస్టులు కేటాయించడం సరికాదన్నారు. ఆ పోస్టులు అదనంగా ఇవ్వాలన్నారు. అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు కేటాయించాలని, రెండు పోస్టులు కేటాయిస్తే ఒక లాంగ్వేజ్‌గా, రెండోది నాన్‌ లాంగ్వేజ్‌గా, 4 పోస్టులు కేటాయిస్తే రెండు లాంగ్వేజ్‌, రెండు నాన్‌ లాంగ్వేజ్‌ పోస్టులు కేటాయించాలని కోరారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల స్థాయిని దిగజార్చవద్దని, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే నియమించాలని అన్నారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియం కొనసాగించాలన్నారు.

బదిలీల జీఓ తక్షణమే విడుదల చేయాలి...

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ హై మాట్లాడుతూ బదిలీల జీఓ తక్షణమే విడుదల చేసి వేసవి సెలవుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్‌ టూ హైస్కూళ్లలో ఇంటర్మీడియట్‌ తరగతులు బోధించడానికి అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలన్నారు. ఎస్‌జీటీలకు మాన్యువల్‌ కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) టీచర్లకు బదిలీల్లో కొత్తగా మంజూరు చేసిన పోస్టులు ఖాళీలుగా చూపాలన్నారు. మున్సిపల్‌ పాఠశాలల్లో అప్‌గ్రెడేషన్‌ ప్రక్రియ సత్వరమే చేపట్టి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ (లాంగ్వేజస్‌) పోస్టుల్లో హైకోర్టు తీర్పు అమలు చేసిన తర్వాత మిగిలిన పోస్టుల్లో లాంగ్వేజ్‌ పండితులు లభ్యం కానప్పుడు అర్హులైన ఎస్‌జీటీలకు ప్రమోషన్‌ ఇచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని, అలాగే స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టుల్లో కూడా అర్హులైన ఎస్‌జీటీలకు ప్రమోషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించకుంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళన, నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు, సహాధ్యక్షుడు ఐవీ రామిరెడ్డి, సహాధ్యక్షురాలు జి.ఉమామహేశ్వరి, జిల్లా కోశాధికారి ఎన్‌.చిన్నస్వామి, జిల్లా కార్యదర్శులు డి.రాజశేఖర్‌, పి.వెంకటేశ్వర్లు, ఎం.శ్రీను, టి.రమణారెడ్డి, సీహెచ్‌ ప్రభాకర్‌రెడ్డి, పి.బాలవెంకటేశ్వర్లు, ఎం.రాము, రాష్ట్ర కౌన్సిలర్లు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆడిట్‌ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరావు సర్దుబాటు ప్రక్రియపై ఉపాధ్యాయుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement