
బర్లీ రైతులకు ధరాఘాతం
కంపెనీల దురాగతం..
నాగులుప్పలపాడు: బర్లీ పొగాకు సాగు చేసిన రైతుల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోంది. ధర దారుణంగా పతనం కావడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులు చేతికొస్తే చాలని దీనంగా ఎదురుచూస్తున్నారు. అయితే పుండు మీద కారం చల్లినట్టుగా పొగాకు కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకురావడం లేదు. శ్రీమా కంపెనీ నారుతో పంట సాగు చేయండి.. కొనే బాధ్యత మాదిశ్రీ అని జీపీఐతోపాటు మరికొన్ని కంపెనీ ప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మి జిల్లాలో రైతులు నిలువునా మోసపోయారు. తీరా పంట చేతికొచ్చాక నాణ్యత లేదంటూ ధర తెగ్గోయడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. వేలం ప్రారంభమైన తొలినాళ్లలో క్వింటా పొగాకు రూ.8 వేల నుంచి రూ.12 వేలకు కొనుగోలు చేసిన కంపెనీలు.. ఆ సొమ్మును నారు, పట్టలు, ఇతర సామగ్రి కింద జమ వేసుకోవడం గమనార్హం.
సర్కారు చొరవ శూన్యం
ఈ ఏడాది జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో బర్లీ పొగాకు సాగు చేశారు. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి పొగాకు పండించినా సరైన దిగుబడి రాలేదు. అదే సమయంలో కనీస గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో కొనుగోళ్లు మందగించాయి. గత ఏడాది తొలి విరుపులో అడుగాకు సైతం క్వింటా రూ.8 నుంచి రూ.10 వేలు పలికింది. మలి విరుపులో క్వింటా రూ.15 వేల నుంచి రూ.18 వేలకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది క్వింటా మలి విరుపు ఆకు రూ.10 వేలు కూడా పలకడం లేదు. ప్రైవేట్ కంపెనీలు పొగాకు కొనుగోలుకు ముందుకు రాకపోతే టుబాకో బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సుమారు రూ.500 కోట్లు ప్రత్యేక నిధి కేటాయించి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి కొనుగోలు చేశారు. బర్లీ పొగాకు రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని ఇరవై రోజుల క్రితం వ్యవసాయ శాఖా మంత్రి ప్రకటించినా నేటికీ ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం.
కోలుకోవడం కష్టమే..
తొలి వలుపులో ఓ రకంగా ధర చెల్లించిన రైతులు రెండో వలుపు వచ్చేసరికి నాణ్యత సాకు చూపి చేతులెత్తేశారు. వేలంలో పాల్గొనకుండా పత్తా లేకుండా పోయిన కంపెనీల ప్రతినిధులు ఫోన్లు సైతం స్విచాఫ్ చేసుకున్నారు. మూడు నెలలుగా రైతులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా బర్లీ పొగాకు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పెట్టుబడి కోసం భారీగా అప్పు చేసిన రైతుల్లో కలవరం మొదలైంది. దిక్కతోచని స్థితిలో రైతులు పొగాకును తగలబెట్టడంతోపాటు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పత్తి, మిరప సాగులో నష్టాలు చవిచూసిన రైతులు పొగాకు కంపెనీల మాటలు నమ్మి బర్లీ సాగు చేసి దగాపడ్డారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించి పొగాకు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రంగు మారే ప్రమాదం
పొగాకు రెలిచి రెండు నెలలకు పైగా అయింది. వేసవిలో ఎండలు ఎక్కువ కావడంతో ఆకు పాడైపోతోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి బేళ్లు ఆరబెట్టాలి, ఆకును తిరగేయాలి లేదంటే లోపలకు గాలి చేరి ఆకు కుళ్లిపోయి రంగు మారే ప్రమాదం ఉంది. ఈ ప్రక్రియ మొత్తం రైతులకు ప్రహసనంగా మారింది. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని పొగాకు రైతులు కోరుతున్నారు.
బర్లీ పొగాకు కొనే వారేరి?
పేరుకు పోయిన నిల్వలు దిక్కుతోచని స్థితిలో రైతులు కౌలు రైతుల పరిస్థితి మరీ దుర్భరం
రైతులతో కలిసి ఉద్యమిస్తాం
మిగతా పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడంతో వర్జీనియాతోపాటు బర్లీ పొగాకును రైతులు అధికంగా సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చాక కంపెనీలు నిలువునా మోసం చేస్తున్నాయి. పొగాకు రైతులు ఆందోళనకు దిగుతున్నా, ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కంపెనీలు మద్దతు ధర ఇవ్వకపోగా, పత్తాలేకుండా పోవడం ప్రభుత్వ వైఫల్యమే. గతంలో పొగాకు కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించారు. కంపెనీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పొగాకు కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అదే చొరవ చూపాలి. లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం.
– మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఇన్‌చార్జి
జీపీఐ కంపెనీ మోసాన్ని గ్రహించలేకపోయాం
15 ఎకరాల్లో తెల్ల బర్లీ పొగాకు సాగు చేశా. ఇప్పటికే కౌలు, కూలీలకు రూ.లక్షల్లో ఖర్చు చేశా. మొదట్లో జీపీఐ కంపెనీ ప్రతినిధులు పొగాకు కొంటామని మాయమాటలు చెప్పి సాగు చేయించారు. తీరా పంట చేతికొచ్చాక కొద్ది మేర కొనుగోలు చేసి పత్తా లేకుండా పోయారు. లక్షల రూపాయల విలువైన పొగాకు పొలాల్లోనే ఉండిపోయింది. తెచ్చిన అప్పులతోపాటు కూలీలకు డబ్బు ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదు. ఇంతలా మోసం చేస్తారని గ్రహించలేకపోయాం.
– పాలపర్తి సతీష్, పొగాకు రైతు, కండ్లగుంట

బర్లీ రైతులకు ధరాఘాతం

బర్లీ రైతులకు ధరాఘాతం

బర్లీ రైతులకు ధరాఘాతం

బర్లీ రైతులకు ధరాఘాతం