
మళ్లీ మంచి రోజులొస్తాయి
కొనకనమిట్ల: అధికారం చేతిలో ఉందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ, వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కొనకనమిట్ల మండలంలోని వెలిగండ్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామ సర్పంచ్ పాతకోట వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ స్థానిక ఎంపీటీసీ మెట్టు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రెండు చోట్ల ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు అన్నా, ఉడుముల మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీచమైన పనులు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క పథకం కూడా అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిందని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో మళ్లీ మంచి రోజులొస్తాయని, కార్యకర్తలు, నాయకులు అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. కూటమి నాయకుల ఒత్తిడితో అధికారులు వైఎస్సార్ సీపీ జెండాను తొలగించగా.. రెట్టింపు ఉత్సాహంతో రెండు చోట్ల జెండాలు ఏర్పాట చేయడం అభినందనీయమన్నారు. జెండాల ఆవిష్కరణకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలకు గ్రామ నాయకులతోపాటు ఎస్సీ కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ కన్వీనర్ మోరా శంకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గొంగటి జెనీఫా కరుణయ్య, పార్టీ మాజీ మండల కన్వీనర్ రాచమళ్ల వెంకటరామిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి సంజీవరెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు పార్లపల్లి సిద్దానభి, పాలూరి లక్ష్మిసాంబ వెంకటేశ్వర్లు, గొలమారి భవాని తిరుపతిరెడ్డి, పిన్నిక పిచ్చయ్య, బేతా ధనలక్ష్మి ప్రకాష్‌రెడ్డి, ఎంపీటీసీలు కోండ్రు వెంకటేశ్వర్లు, యూత్ నాయకులు గాడి కోనేటిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, తంగిరాల బ్రహ్మరెడ్డి, గర్రె శ్రీనివాసులు, చంద్రశేఖర్, కట్టా రమణయ్య, బసాపురం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అధికారం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తిస్తే సహించేది లేదు మాజీ ఎమ్మెల్యేలు అన్నా, ఉడుముల భారీ జన సందోహం మధ్య వెలిగండ్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండాల ఆవిష్కరణ

మళ్లీ మంచి రోజులొస్తాయి