
అవగాహన కల్పిస్తున్న ఆర్టీఓ అమర్‌నాయక్
మార్కాపురం: డ్రైవర్లు రోడ్డు ప్రమాదాల నివారణకు తమవంతు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని మార్కాపురం ప్రాంతీయ రవాణా అధికారి అమర్‌నాయక్ సూచించారు. శుక్రవారం ఆటో, కారు, లారీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఉదయం 9 గంటల వరకూ వాహనాలు జాగ్రత్తగా నడపాలని తెలిపారు. మంచు ఎక్కువగా ఉంటే వాహనాన్ని ఆపి మంచు తగ్గిన తర్వాతే ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పారు. డ్రైవరు మద్యం, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడిపితే కచ్చితంగా ప్రమాదం జరుగుతుందని, దీనివలన రెండువైపులా ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విలువైన జీవితం, కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలన్నారు. కారు ప్రయాణికులు సీటుబెల్టు కచ్చితంగా ధరించాలన్నారు. మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ మాధవరావు మాట్లాడుతూ టూ వీలర్స్ నడిపేవారు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, స్పీడ్‌గా వెళ్లవద్దని సూచించారు. వాహనానికి కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించాలని సూచించారు.
ఆర్టీఓ అమర్‌నాయక్