
తల్లికి వందనం ఈ–కేవైసీ పూర్తి చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో భాగంగా పెండింగ్ ఈ–కేవైసీ మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనం నుంచి ఎంపీడీవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్వరమే పెండింగ్ ఈ–కేవైసీ పూర్తి చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది బదిలీ అయ్యే జూలై 5వ తేదీ లోపు సిటిజన్ ఈ–కేవైసీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
జూలై 8న 10 వేల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ...
ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చేపట్టాలని కలెక్టర్ చెప్పారు. ఫారం పాండ్స్, ఫిషింగ్ పాండ్స్, కంపోస్టు పిట్స్ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డ్వామా ఆధ్వర్యంలో 8వ తేదీ జిల్లాలో 750 ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉందన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, పాల్గొన్నారు.
కార్మికుల రోజువారీ
వేతనాల సవరణ
ఒంగోలు వన్‌టౌన్: కార్మికుల రోజువారీ వేతనాలను కలెక్టర్ సవరణ చేసినట్లు ఒంగోలు ఉపకార్మిక కమిషనర్ ఎ.గాయత్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యం లేని కార్మికులకు రూ.694, కొంత వరకూ నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.791, నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.899, పూర్తి స్థాయిలో నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.1042గా వేతనాలు సవరించినట్లు వెల్లడించారు. సవరించిన వేతనాలు ఏప్రిల్ 1, 2025 నుంచి వర్తిస్తాయన్నారు.