బాబు మోసకారి.. | - | Sakshi
Sakshi News home page

బాబు మోసకారి..

Jul 1 2025 7:17 AM | Updated on Jul 1 2025 7:17 AM

బాబు మోసకారి..

బాబు మోసకారి..

ఒంగోలు సిటీ: ఎన్నికల ముందు ఎన్నో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని చంద్రబాబు మోసం చేసి వెన్నుపోటు పొడిచాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజల్ని వంచించిన ఘనత చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. ఏడాది కాలంగా సాగిన వంచన పాలనపై ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’’ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలు అమలు చేయకుండానే అన్నీ ఇచ్చేశామని చెప్పడం దుర్మార్గమన్నారు. సంవత్సరానికి మూడు సిలిండర్లు, పింఛన్లు 40 శాతం మందికి కూడా అందలేదన్నారు. నీకు రూ.15 వేలు..రూ.15 వేలు, రూ.18 వేలు, రూ.18 వేలు అంటూ మహిళల్ని దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని, అంతవరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు సిల్క్‌ డెవలప్‌మెంట్‌లో పెట్టేశామని చెబుతున్నారని విమర్శించారు. బాబు మోసాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’’ పేరుతో వైఎస్సార్‌ సీపీ ప్రజల వద్దకు వెళుతోందన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో చేపట్టే కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో చంద్రబాబు మోసాలను ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న పొగాకు రైతుకు అండగా నిలిచేందుకు జగన్‌ పొదిలికి వచ్చారన్నారు. ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది అక్రమంగా జొరబడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లపై రాళ్లతో దాడి చేశారన్నారు. అమరావతి పేరుతో ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్పీని కలసి వినతి పత్రాన్ని ఇస్తామని, అవసరమైతే హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తామని హెచ్చరించారు. పార్టీ కేడర్‌పై అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పార్టీ లాయర్లతో అన్ని సిద్ధం చేశామన్నారు. లిక్కర్‌ కేసును సృష్టించి ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై అన్యాయంగా కేసుపెట్టారన్నారు. ఆయన్ను అరెస్టు చేయడం హేయమన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. 2027లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

మాటతప్పిన కూటమి నేతలను నిలదీయండి : బూచేపల్లి

ఎన్నికలప్పుడు సూపర్‌ సిక్స్‌తో పాటు ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మభ్యపెడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌ ఇచ్చేశామని, అదేమని అడిగితే నాలుక మందం అంటూ బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ‘‘బాబు ష్యూరిటీ–భవిష్యత్‌ గ్యారంటీ’’ అంటూ ఎన్నికల్లో పోటీ చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలన చూసి ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’’ అంటూ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. హామీలు తుంగలోకి తొక్కి, ఏ హామీలు నెరవేర్చారని గడపగడపకూ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నారని టీడీపీ ప్రజాప్రతినిధులను నిలదీశారు. తల్లికి వందనం పథకం చాలా మంది లబ్ధిదారులకు అందలేదన్నారు. చంద్రబాబు మోసాలను గుర్తుంచుకుని మీ గడప ముందుకు వచ్చిన వారిని నిలదీయండని ఆయన కోరారు. పార్లమెంట్‌ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై లేని లిక్కర్‌ కేసు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున, మాజీ మంత్రి కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆదిమూలపు సురేష్‌, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌, మాజీ మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజల్ని వంచించిన ఘనత చంద్రబాబుది హామీలు అమలు చేయాలని అడుగుతున్న వారిపై తప్పుడు కేసులు ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కారుమూరి మాట తప్పిన పాలకులను నిలదీయండి: బూచేపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement