
వెంకట కార్తీక్‌ను సన్మానిస్తున్న పట్టణ ప్రముఖులు
చీరాల రూరల్: దిచక్ర వాహనంపై దేశం మొత్తం పర్యటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించేందుకు యువకుడు కృషి చేయడం చిన్న విషయం కాదని పలువురు వక్తలు పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి గురువారం రాత్రి చీరాల గడియార స్తంభం సెంటర్‌కు చేరుకున్న నెల్లూరుకు చెందిన టీ వెంకట కార్తీక్‌ను పట్టణానికి పలువురు ప్రముఖులు పూలమాలలు, శాలువాలువేసి ఘనంగా సత్కరించారు. భారీగా బాణా సంచాలు కాల్చి వెంకట కార్తీక్ వెన్నుతట్టి తమవంతు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా వెంకట కార్తీక్ మాట్లాడుతూ సమాజంలో నేటి యువత చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారని అటువంటి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు తాను దేశం మొత్తం పర్యటిస్తున్నట్లు చెప్పారు. తన పర్యటన 14 ఫిభ్రవరి 2022 నెల్లూరులో ప్రారంభించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో తన యాత్ర పూర్తవుతుందని, యాత్ర పూర్తయిన వెంటనే గిన్నిస్ బుక్ ఆఫ్ వర ల్డ్ రికార్డు కోసం పేరు నమోదు చేయించుకోనున్నట్లు చెప్పారు. 580 రోజుల్లో 135 వేల కిలో మీటర్లు యాత్ర పూర్తిచేసినట్లు చెప్పారు. తాను చేస్తున్న ఈ యాత్రలో ఆర్థికంగా ఎవరి సహకారం తీసుకోలేదని, తన తండ్రి సహకారంతోనే యాత్ర పూర్తి చేసినట్లు చెప్పారు.