ఒంగోలు: ఆపరేషన్ స్వేచ్ఛ ఫేజ్ 3లో భాగంగా గురువారం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నలుగురు బాలకార్మికులను గుర్తించామని జిల్లా ఉప కార్మికశాఖ కమిషనర్ ఎస్.శ్రీనివాసకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11 నుంచి తనిఖీలు నిర్వహించామన్నారు. నగరంలో రిక్షాల బజారు, బాపూజీ మార్కెట్ సెంటర్, మంగమూరు రోడ్డు, పాత గుంటూరు రోడ్డులో విస్తృతంగా తనిఖీలు చేసి నలుగురు బాలకార్మికులను గుర్తించారు. వారిని తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చారు. యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. సహాయ కార్మిక కమిషనర్ కె.కనకదుర్గ భవాని, సహాయ కార్మిక శాఖ అధికారులు ఎం.ఎలిజబెత్, వెంకటేశ్వర్లు, ఎన్‌జీవోలు, డీసీపీఓ దినేష్‌కుమార్, దిశ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.