పొదిలి రూరల్: కొనకనమిట్ల మండలం పెదారికట్ల పంచాయతీ గొంటువారిపల్లెకు చెందిన దూలం జనార్జన్‌రెడ్డి(15) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. జనార్దన్‌రెడ్డిని ఇటీవల విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించారు. అక్కడ ఆరోగ్యం సరిగ్గా లేదని మానేయడంతో ఒంగోలులో చేర్పించారు. వారం క్రితం ఇంటికి వచ్చి ఇక కాలేజీకి వెళ్లననడంతో తల్లిదండ్రులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఏమైందో తెలియదు కానీ పొలంలో పురుగు మందు తాగి ఇంటికి వచ్చి పడిపోయాడు. బంధువులు గమనించి, గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే వెంట వచ్చిన పోలీసుల వాహనంలో పొదిలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
జే.పంగులూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈఘటన మండల పరిధిలోని అలవలపాడు సచివాలయ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. చందలూరు గ్రామానికి చెందిన అత్తింటి వీరమ్మ (39) తన భర్త నిల్సన్‌తో బైక్‌పై గ్రామం నుంచి వెంకటాపురం బంధువుల ఫంక్షన్‌కు బయలుదేరారు. అలవలపాడు గ్రామంలోకి వచ్చేసరికి ముందు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌ను దాటే క్రమంలో వస్తున్న నాలుగు చక్రాల వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనక కూర్చున్న వీరమ్మ ఎడమ వైపు బైకు నుంచి కిందకు జారి పడింది. భర్త నిల్సన్ కుడివైపు పడ్డాడు. వెనుక నుంచి ఎడమ వైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్.. కింద పడిన వీరమ్మ మీదుగా వెళ్లింది. ఈ ప్రమాదంలో వీరమ్మ తలకు, పొట్టబాగానికి బలమైన గాయాలయ్యాయి. దీంతో వీరమ్మ ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వీరమ్మను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త నిల్సన్‌కు గాయాలు కాలేదు. మృతురాలు వీరమ్మకు ఒక బాబు, పాప ఉన్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన రేణింగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.