సత్తాచాటిన పల్నాడు గిత్తలు

రాచర్ల: మండలంలోని యడవల్లి పంచాయతీ పరిధిలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయ స్థిర ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆరు పళ్ల సైజు ఎడ్ల బండలాగుడు పోటీల్లో పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన బత్తుల చిన్నబ్బాయి యాదవ్ ఎడ్లు సత్తా చాటాయి. పోటీల్లో 11 జతల ఎడ్లు పాల్గొనగా చిన్నబ్బాయి యాదవ్ గిత్తలు నిర్ణీత 20 నిమిషాల్లో 3163 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.40 వేలు, కంభం మండలం యర్రబాలేనికి చెందిన హేమలతనాయుడు ఎడ్లు 3,005 అడుగులు లాగి రెండవ బహుమతి రూ.30 వేలు, నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరుకు చెందిన బీరం బుల్స్ 2,787 అడుగులు లాగి మూడో బహుమతి రూ.25 వేలు, పల్నాడు జిల్లా చుండూరు మండలం వేటపాలేనికి చెందిన శివకృష్ణచౌదరి ఎడ్లు 2,750 అడుగులు లాగి నాలుగో బహుమతి రూ.15 వేలు, నంద్యాల మండలం కాంతినగరం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఎడ్లు 2,505 అడుగులు లాగి ఐదో బహుమతి రూ.10 వేలు, నర్సరావుపేట మండలం దొండపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్ ఎడ్ల జత 2,343 అడుగులు ఆరవ బహుమతి రూ.5 వేలు సాధించాయి. ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఎడ్ల యజమానులకు బహుమతులు పంపిణి చేశారు. ప్రథమ బహుమతిని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అందజేశారు.
గుడిమెట్టలో విజేతగా జేసీ అగ్రహారం ఎడ్లు
గుడిమెట్ట గ్రామంలో హజరత్ మౌలాలీస్వామి ఉరుసు మహోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీల్లో బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహారానికి చెందిన లక్కు నాగశివశంకర్ ఎడ్లు 862 అడుగులు లాగి విజేతగా నిలిచాయి. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మనపల్లె గ్రామానికి చెందిన దప్పిలి అంజిరెడ్డి ఎడ్లు 737 అడుగులు లాగి రెండో స్థానంలో, వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం నర్సపురం గ్రామానికి చెందిన కామిని వెంకట సాయిప్రతాప్‌రెడ్డి ఎడ్లు 603 అడుగులు లాగి మూడో స్థానంలో నిలిచాయి. మొదటి బహుమతి రూ.50 వేలను హజరత్ మౌలాలి స్వామి దేవస్థానం, రెండో బహుమతి రూ.40 వేలను బెల్లం నాగిరెడ్డి, కామిరెడ్డి భూపాల్ రెడ్డి, మూడో బహుమతి రూ.20 వేలను నక్కా రామకృష్ణయ్య కుమారులు అందజేశారు.