
ఒంగోలు టౌన్: బాలికపై లైంగిక దాడి కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష పడేలా సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీసులను ఎస్పీ మలికా గర్గ్ అభినందనలు తెలిపారు. 2017 మేలో ఒంగోలులో బాలికపై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో లైంగిక దాడి చేసిన ఘటన తాలుకా పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. మంగళవారం ఒంగోలులోని పోక్సో కోర్టు జడ్జి ఎంఏ సోమశేఖర్ యావజీవ శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
కేసులో నిందితునికి శిక్ష పడడంలో కృషి చేసిన అప్పటి ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, జిల్లా పోక్సో కో ఆర్డినేటర్ సభ్యులుగా ఉండి కోర్టులో సకాలంలో సాక్ష్యాలను ప్రవేశపెట్టిన దిశ డీఎస్పీ పల్లపురాజు, దిశ ఎస్సై షేక్ రజియా సుల్తానా, అప్పటి తాలుకా ఎస్సై ప్రసాద్, ఏఎస్సై ఈవి స్వామి, కానిస్టేబుల్ ఎం యలమంద, తాలుకా హెడ్‌కానిస్టేబుల్ షేక్ సద్దాంలను ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మలికాగర్గ్ మాట్లాడుతూ...చిన్నారులపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడే వారు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పోక్సో మానిటరింగ్ టీమ్ ద్వారా సమర్ధవంతమైన ట్రయిల్ మానిటరింగ్ చేసి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేస్తున్నామని తెలిపారు.