
బల్లికురవ: మద్యం మత్తు, ఎండతాపానికి గురై రోడ్డు మార్జిన్‌లోనే పడిపోయి యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం మండలంలోని కొత్తమల్లాయపాలెం గ్రామ సమీపంలో జరిగింది. ఎస్సై వి.వేమన వివరాల మేరకు.. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ (35) ఇక్కడ క్వారీల్లో పనిచేస్తున్నాడు. సంతమాగులూరుకు చెందిన కాంట్రాక్టర్ సత్యం ద్వారా వచ్చాడు.
మద్యానికి బానిస కావడంతో ఏ క్వారీలోనూ సక్రమంగా పనిచేయలేకపోయాడు. దీంతో క్వారీల నిర్వాహకులు పనిలో పెట్టుకోలేదు. ఈ క్రమంలో కొత్తమల్లాయపాలెం నుంచి క్వారీలకు వెళ్లే రోడ్డులోని మార్జిన్‌లో పూటుగా మద్యం సేవించి పడిపోయి ఉండటంతో స్థానికులు ఎస్సైకి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చి ఎస్సై పరిశీలించగా అతను మృతి చెందినట్లు తెలుసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.