
వైఎస్సార్ సీపీ ప్రభపై నుంచి మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్
● రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి
డాక్టర్ ఆదిమూలపు సురేష్
పుల్లలచెరువు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాగా పనిచేస్తుందని రాష్ట్ర పురపాలక శాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఐటీ వరంలో శుక్రవారం రాత్రి సంతాన వేణుగోపాలస్వామి తిరునాళ్ల, చాపలమడుగులోని పోలేరమ్మ తల్లి తిరునాళ్లలో మంత్రి సురేష్ పాల్గొని దేవతా మూర్తులను దర్శనం చేసుకున్నారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాని కంటిలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం అన్నారు. నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధిపథంలో ఉందని, గతంలో ఎన్నుడూ లేని అభివృద్ధిని నేడు రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నవరత్నాల ద్వారా దాదాపు 99 శాతం హామీలను అమలు చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. చట్టాలను మాయచేసే చంద్రబాబు ఏదో ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలవగానే సంబరాలు చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ లో తప్పు చేస్తే ఎంతటివారినైనా ఉపేంక్షేంచేది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తారని అన్నారు. టీ5 కాలువ పనులకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తారని చెప్పారు. దాంతో పాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు రంగన్నపాలెం వద్ద 223 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణపనులకు కూడా శంకుస్థాపన చేస్తామన్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు మంత్రి సురేష్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ రెంటపల్లి సుబ్బారెడ్డి, ఎంపీపీ లాజర్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌లు సత్యనారాయణరెడ్డి, ఆవుల కోటిరెడ్డి, వైపాలెం మండల కన్వీనర్ ఓబుల్‌రెడ్డి, గడ్డంసుబ్బయ్య, మల్లెల వెంకటరెడ్డి, లక్ష్మానాయక్ పాల్గొన్నారు.