
ఒంగోలు అర్బన్: మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, మహిళ ఆర్థిక సాధికారత సాధిస్తే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. శనివారం వైఎస్‌ఆర్ ఆసరా పథకం మూడో విడత అర్హులకు బ్యాంకు ఖాతాలో నేరుగా నిధులు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో ప్రారంభించారు. దీనికి అనుబంధంగా జిల్లా స్థాయిలో ప్రకాశం భవనంలో వీడియో సమావేశం ద్వారా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో కలెక్టర్‌తో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నగర మేయర్ గంగాడ సుజాత, ఇతర అధికారులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసరా మూడో విడత లో జిల్లాలోని 36,729 స్వయం సహాయక సంఘాల్లో 3,59,506 మంది సభ్యులకు రూ.280.50 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. మహిళలు స్వశక్తితో ఎదగాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆసరా పథకంలో జిల్లాలో మొదటి విడతలో 35,701 స్వయం సహాయక సంఘాల్లోని 3,51,376 మంది సభ్యులకు రూ.267.54 కోట్లు, రెండో విడతలో 36,721 సంఘాల్లోని 3,59,027 మంది సభ్యులకు రూ.291.68 కోట్లు ప్రభుత్వం అందించిందని చెప్పారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ మహిళలు అన్నీ రంగాల్లో ముందడుగు వేసేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అధికంగా మహిళలకు అందేలా చూస్తూ మహిళా పక్షపాతిగా ఉన్నారని కొనియాడారు. దీనిలో డీఆర్‌డీఏ పీడీ బాబురావు, మెప్మా పీడీ రవికుమార్, ఎల్‌డీఎం యుగంధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేలా బడుగు వికాసం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ యువతకు 45 శాతం సబ్సిడీతో అందించిన మూడు కార్లు, రెండు మినీ ట్రక్కులను లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు.
సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం
పొదిలి రూరల్: వైఎస్సార్ ఆసరా 3 వ విడత నగదును వారి ఖాతాల్లో జమ చేసినందుకు శనివారం పొదిలి మండలంలోని ఉప్పలపాడు, ఆముదాలపల్లి, ఏలూరు, తలమళ్ల, కుంచేపల్లి, పాములపాడు, కొండాయపాలెం, కంభాలపాడు, మల్లవరం, సూదనగుంట, పొదిలి ఆర్బీకేల్లో డ్వాక్రా మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మర్రిపూడిలో..
మర్రిపూడి: మూడో విడత వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ వాకా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్ సుదీపా, ఈవోఆర్డీ నాగూర్‌వలి, సర్పంచ్ కే భాస్కర్ పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ ఆసరా మూడో విడత వేడుకలు పాల్గొన్న కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్, నగర మేయర్

మర్రిపూడిలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం..

పొదిలిలో క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు