మనసే లక్ష్యం

- - Sakshi

ఆర్థికంగా వెనుకబడినా.. ఉన్నత లక్ష్యాల సాధనలో దూసుకుపోవాలి. ఉత్తమైన ఆలోచనలతో నిర్దేశించుకున్న శిఖరాలను చేరుకోవాలి. ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో జిల్లా ప్రథమ పౌరుడు మదిలో మెదలిన మహోన్నత ఆలోచన. ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ ఎందరో పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు దిక్సూచీగా మారనుంది. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులను ప్రతి శనివారం ఇంటికి పిలిపించి వారితో మమేకమవుతూ వారి లక్ష్యాలను, భవిష్యత్‌ ఆలోచనలను నేరుగా తెలుసుకుంటున్నారు కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌. కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలను సైతం తెలుసుకుని వారి బంగారు భవిష్యత్‌కు ఉన్నత బాటలు వేసేలా స్ఫూర్తిని నింపుతున్నారు.
మాటే మంత్రం..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు స్థానికంగా ఉన్న సమస్యలను ఉన్నతాధికారులు నేరుగా తెలుసుకునేందుకు కలెక్టర్‌ ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు. గతేడాది గిద్దలూరు నియోజక వర్గం కంభం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అదే గ్రామంలోని ఎస్సీ హాస్టల్‌ విద్యార్థులతో మాటామంతి సాగించారు. విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను తెలుసుకున్నారు. ఆ సందర్భంగా వారు చెప్పిన సమాధానాలను విని ఆశ్చర్యపోయారు. భవిష్యత్‌లో తాము కానిస్టేబుల్‌, వీఆర్‌ఓ, చిన్న ప్రభుత్వ ఉద్యోగం వంటి చిన్నచిన్న కొలువు చేయాలని ఉందని చెప్పడంతో నివ్వెరపోయారు. ఈ సందర్భంలోనే విద్యార్థులకు కెరియర్‌ గైడెన్స్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. అందులో భాగంగానే ప్రతి శనివారం ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, ఎస్టీ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో మమేకమవుతున్నారు.

నిర్ధిష్టమైన లక్ష్యాలు...

‘కాఫీ విత్‌ కలెక్టర్‌’కు హాజరైన విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు ప్రణాళికబద్ధంగా సాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో కెరియర్‌ గైడెన్స్‌ పేరుతో ప్రత్యేకంగా మెంటార్స్‌ను పిలిపించి వారితో విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇప్పించడంతో పాటు అవసరమైన పుస్తకాలు అందజేస్తున్నారు. కెరియర్‌ గైడెన్స్‌లో 39 రకాల అంశాలతో వివిధ నైపుణ్యాలు కలిగేలా ఇప్పటికి దాదాపుగా 29 సెషన్స్‌ విద్యార్థులకు ఇచ్చారు. మొదటిలో చిన్న చిన్న లక్ష్యాలను చెప్పిన విద్యార్థులు ఇప్పుడు ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. కలెక్టర్‌ చేపట్టిన కార్యక్రమం విద్యార్థుల్లో ఎంత స్ఫూర్తిని రగిలించిందో అవగతమవుతోంది. విద్యార్థులు స్వయంగా ఆసక్తి ఉన్న రంగం, ఉద్యోగాలపై లక్ష్యం నిర్దేశించుకుని అందుకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం, అవగాహనతో పాఠశాల చదువుల నుంచే సరైన అడుగులు వేసేలా కెరియర్‌ గైడెన్స్‌ ఉపకరిస్తోంది.

రియల్‌ లైఫ్‌ మోడల్స్‌ను విద్యార్థులతో

అనుసంధానం:

‘కాఫీ విత్‌ కలెక్టర్‌’లో ప్రతి విద్యార్థితో నేరుగా కలెక్టర్‌ మాట్లాడుతూ వారి లక్ష్యాలను తెలుసుకుంటున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, డాక్టర్‌, లాయర్‌, ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌, పోలీసు అధికారి ఇలా వారి ఆసక్తిని తెలుసుకుని అవసరమైన సూచనలు ఇస్తున్నారు. అంతేకాదు ‘రియల్‌ లైఫ్‌ రోల్‌ మోడల్స్‌’ని విద్యార్థులతో మాట్లాడిస్తూ స్ఫూర్తిని నింపుతున్నారు. డాక్టర్‌ అవ్వాలని చెప్పిన విద్యార్థులకు డాక్టర్లతో, పోలీసు అధికారి కావాలనే లక్ష్యాలను చెప్పిన విద్యార్థులకు పోలీసు అధికారులతో సలహాలు సూచనలు ఇప్పిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు...

వినూత్న కార్యక్రమాల అమలు కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులకు సంబంధించి ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ కార్యక్రమాన్ని వివరించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి కలెక్టర్‌కు పిలుపు వచ్చింది. ఈ మేరకు కలెక్టర్‌ ఏఎస్‌.దినేష్‌ కుమార్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఢిల్లీ వెళ్లారు. ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ పేరుతో చేపట్టిన కెరియర్‌ గైడెన్స్‌ క్లాసులకు సంబంధించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అందులో భాగంగా ‘మార్గదర్శిని’కి సంబంధించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ బాటగా ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ జిల్లాలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ వినూత్న ప్రయోగం విద్యార్థుల లక్ష్యాలను తెలుసుకుని కెరియర్‌ గైడెన్స్‌ కార్యక్రమాన్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ బృందం ‘మార్గదర్శిని’ పేరుతో కేంద్రంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top