ఒంగోలు/పుల్లలచెరువు: జాతీయస్థాయి ఇన్‌స్పైర్ మనక్ పోటీలకు నిఖిల్‌చంద్ ఎంపికయ్యాడు. పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నిఖిల్ చంద్ ప్రదర్శించిన ఫ్యాబ్రికేషన్ ఆఫ్ యాక్సా మిషన్ అనే ప్రాజెక్టు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈనెల 23, 24 తేదీల్లో కాకినాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఆన్‌లైన్‌లో జరిగాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 15 ప్రాజెక్టులు పోటీల్లో పాల్గొన్నాయి. ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో నిఖిల్‌చంద్ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా ఎంపికై న నిఖిల్‌చంద్‌ను, గైడు ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయుడ్ని డీఈవో పి.రమేష్, మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌలేశ్వర్, సైన్స్ అధికారి టి.రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. పుల్లలచెరువు జెడ్పీ హైస్కూల్లో శనివారం ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థిని, గైడ్ ఉపాధ్యాయుడు మస్తాన్‌వలిని పాఠశాల హెచ్‌ఎం ఉమామహేశ్వరరావు అభినందించారు.
ప్రాజెక్టు ప్రత్యేకతలు..వినియోగించిన
పరికరాలు:
ఈ పరికరం తయారీకి తక్కువ బరువు కలిగిన ఐరన్ ఫ్రేమ్, నాలుగు హెక్సా బ్లేడ్లు, నాలుగు వైస్‌లు, 12 ఓల్టుల పవర్‌తో పనిచేసే మోటారు, స్క్రూలు, బోల్టులు వినియోగించారు. ఈ మిషన్‌కు నాలుగు వైపులా నాలుగు హెక్సాబ్లేడ్లను బిగించారు. నాలుగు వైస్‌లను అమర్చారు. వాటి సాయంతో పైపులను, చెక్కలను, మనకు కావాల్సిన కొలతలతో మోటారు ను ఆన్‌చేయగానే హెక్సాబ్లేడ్లు కట్ చేస్తున్నాయి. దీనిసాయంతో ఒకే సారి నాలుగు పైపులను కట్ చేయవచ్చు. సమయం ఆదా అవడం, శ్రామికుల సంఖ్య తగ్గుతుంది. తక్కువ సమయంలో పని పూర్తిచేయగలుగుతారు. తక్కువ శబ్దంతో పనిచేయడం, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులువుగా మార్చేందుకు అవకాశం ఉంటుంది. దీనిని విడివిడి భాగాలు చేసి స్క్రూలు, బోల్టుల సాయంతో మళ్లీ బిగించుకునే సౌలభ్య ఉంది. తన ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికకావడం ఆనందంగా ఉందని విద్యార్థి నిఖిల్ చంద్ పేర్కొన్నారు.