
వైద్య విద్యార్థుల స్నాతకోత్సవాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు అర్బన్: ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఇక నుంచి వైద్యులుగా సేవాగుణంతో వైద్య సేవలందించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ సూచించారు. జీజీహెచ్ ప్రాంగణంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, హౌస్ సర్జన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలు పంపిణీ చేసే కాన్విగేషన్ (స్నాతకోత్సవం) కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై దీపాలు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కోర్సు పూర్తి చేసిన 100 మంది వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి వైద్యులుగా మారిన వైద్య విద్యార్థులు పేదలకు సేవలందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వైద్యం రంగంలో వస్తున్న వినూత్న, ఆధునిక మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిస్తున్నానన్నారు. వైద్య విద్యను ఇంతటితో ఆపకుండా ప్రత్యేకత ఉండే వైద్య విద్యలను అభ్యసించి ప్రత్యేక వైద్యులు గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. భారత వైద్యరంగం శక్తియుక్తులు కరోనా విపత్కర పరిస్థితిల్లో యావత్‌ప్రపంచం గుర్తించిందన్నారు. వ్యక్తిగత ఉద్యోగ జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ నైతిక విలువలతో ప్రజలకు వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమానికి వైద్య కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాల్మన్‌రాజు అధ్యక్షత వహించారు. దీనిలో అనాటమీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, అనాటమీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ కేశ్, జీవన్‌లు పాల్గొని వైద్య రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై పట్టభద్రులకు అవగాహన కల్పించారు
మానవ సేవే మాధవ సేవగా భావించాలి వైద్య విద్యార్థుల స్నాతకోత్సవంలో కలెక్టర్ దినేష్‌కుమార్