
నడింపల్లిలో తడిసిన ఎండుమిర్చి
మార్కాపురం: పట్టణంతో పాటు సమీప గ్రామాల్లో శనివారం సాయంత్రం గం.3.30 నుంచి గం.4.30 వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో, కళ్లాల్లో ఆరబోసుకున్న మిర్చి రైతులు ఇబ్బందులు పడ్డారు. అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురిసింది. మిర్చి తడిసిపోవడంతో రంగు మారి, కాయ నాణ్యత, దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కంభం: మండల కేంద్రం కంభంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ అధికంగా ఉండగా మధ్యాహ్నం 2.30 గంటలకు ఒక్కసారిగా వాతావరం చల్లబడి సుమారు గంటన్నర సేపు భారీ వర్షం కురిసింది. మండలంలోని నడింపల్లి గ్రామంలో రైతు కై రంకొండ రంగసాయి కళ్లంలో 20 క్వింటాళ్ల ఎండు మిర్చి ఆరబెట్టి ఉండగా వర్షానికి తడిసి పోయిందని, కొంతభాగం వర్షానికి కొట్టుకు పోయిందని రైతు వాపోయాడు. వర్షానికి వీధులు, పంటపొలాలు జలమయమయ్యాయి.
బేస్తవారిపేట: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రైతులు ఎండు మిరపకాయలు కోత కోసి పొలాల్లో ఆరబెట్టుకున్నారు. అకాల వర్షానికి కొందరి రైతుల మిరపకాయలు తడిసిపోయాయి. మార్కెట్‌కు తరలించే సమయంలో వచ్చిన అకాల వర్షాలకు రైతులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మార్కెట్‌లో మంచి ధర ఉండటంతో వర్షాలకు తడిసిన మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనిగిరి రూరల్: కనిగిరి ప్రాంతంలో శనివారం సాయంత్రం జోరుగా వాన కురిసింది. సుమారు అర గంటకు పైగా జోరుగా గాలితో వర్షం కురవడంతో చెట్ల కొమ్మలన్నీ తెగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంగా మారింది. దీంతో దాదాపు గంటకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్గడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శివారు ప్రాంతాల్లోని మట్టిరోడ్లు చిత్తడిమయంగా మారాయి. రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రధానంగా కాపు మీద ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.

వర్షం నీరు తొలగిస్తున్న రైతు

పట్టణంలో కురుస్తున్న వర్షం