
వర్ధంతి సభలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి కె.మన్మథరావు
ఒంగోలు టౌన్: ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన ప్రజా న్యాయవాది మట్లే రాఘవరాణి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని హైకోర్టు న్యాయమూర్తి కె.మన్మథరావు అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్లో శనివారం ప్రముఖ న్యాయవాది మట్లే రాఘవరాణి ప్రథమ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల హక్కుల కోసం చివరి శ్వాస వరకు నిజాయితీగా నిలబడిన రాఘవరాణి న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చారని కొనియాడారు. సమాజం పట్ల పూర్తి అవగాహన కలిగిన ఆమె.. సమాజంలోని దగా పడిన జీవితాలకు బాసట నిలిచారన్నారు. మట్లే వెంకట సుబ్బయ్య, మట్లే రాఘవరాణి దంపతుల ప్రేరణతోనే తాను నిత్యం ప్రజలతో మమేకమై న్యాయమూర్తిగా ఎదగడమే కాకుండా తన సంతానాన్ని కూడా న్యాయవాద విద్యనభ్యసించేందుకు ప్రోత్సహించానని తెలిపారు. జిల్లాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాఘవరాణి మహిళా న్యాయవాదులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. మట్లే దంపతుల స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజల కోసం అహర్నిశలు పాటుపడిన రాఘవరాణి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజల కోసం వారు చేసిన త్యాగాలను ఆయన గుర్తుచేశారు. జిల్లాలో జరిగిన అన్ని ప్రజా ఉద్యమాల్లో మట్లే దంపతుల ప్రమేయం ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి తెలిపారు. ఆ దంపతులను చూస్తుంటే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి దంపతులు గుర్తుకు వస్తారన్నారు. రాష్ట్రంలో క్రైస్తవ ఆస్తుల కబ్జా కాకుండా కాపాడడానికి వెంకట సుబ్బయ్య ఎంతో కృషి చేశారని, ఆయన నివాసం ప్రజా ఉద్యమాలకు, ఉద్యమకారులకు నెలవుగా ఉండేదని గుర్తు చేశారు. ప్రరసం అధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ సారా వ్యతిరేక ఉద్యమంతో పాటుగా అనేక మహిళా ఉద్యమాలలో అమె కీలక పాత్ర పోషించారని చెప్పారు. ప్రజా సంఘాల నాయకుడు పి.గోవిందయ్య మాట్లాడుతూ ఎన్ని బెదిరింపులు వచ్చినా, అరెస్టులు చేసినా బెదరని ప్రజా న్యాయవాదులు మట్లే దంపతులు లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత మట్లే దంపతుల చిత్రపటాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. సభకు ఓపీడీర్ రాష్ట్ర ఆధ్యక్షుడు చావలి సుధాకర్ అధ్యక్షత వహించారు. మిరియం అంజిబాబు, కేశవరావు, వైవీ సుబ్బారావు, కాటం అరుణమ్మ, కె.అరుణ, కుటుంబసభ్యులు న్యాయమూర్తి మట్లే కృష్ణ, విప్లవజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి కె.మన్మథరావు