
గిద్దలూరు రూరల్: కోళ్ల లారీ బోల్తా పడి వందలకోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని చికెన్ దుకాణాలకు సప్‌లై చేస్తూ వెళుతున్న కోళ్ల ఫారమ్ లారీ మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. లారీ రోడ్డుకు అడ్డంగా పడటంతో కొంత సమయం ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అనంతరం కోళ్లఫారమ్ నిర్వాహకులు క్రెయిన్ సహాయంతో లారీని రోడ్డు నుంచి పక్కకు తొలగించారు. లారీ కిందపడి రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. వందల కోళ్లు మృత్యువాతపడ్డాయి.
ఇష్టంతో చదవండి
● కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు అర్బన్: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. క్యాంపు కార్యాలయంలో ఒంగోలులోని నాలుగు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు చెందిన 20 మంది 9వ తరగతి విద్యార్థులతో శనివారం ‘కాఫీ విత్ కలెక్టర్’ కార్యక్రమం నిర్వహించి ఇష్టాగోష్టి నిర్వహించారు. విద్యార్థుల అభిరుచి తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని పలు సూచనలు చేశారు. కలెక్టర్‌గా ఎదిగిన తన గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. అనంతరం ఇంగ్లిషు గ్రామర్ పుస్తకాలను సంతకాలు చేసి అందచేశారు. కార్యక్రమంలో సంక్షేమ సాధికారత అధికారి లక్ష్మానాయక్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి లింగయ్య, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అంకబాబు, కె.శ్రీలత, దుర్గాలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
జ్యుడీషియల్ అధికారులతో సమీక్ష
ఒంగోలు: హైకోర్టు జడ్జి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి బొప్పూడి కృష్ణమోహన్ శనివారం ఒంగోలుకు చేరుకున్నారు. స్థానిక ఎన్‌ఎస్‌పీ అతిథి గృహం వద్ద ఆయన్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి, కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్, ఎస్పీ మలికాగర్గ్‌లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా పోర్టుఫోలియో జడ్జి బొప్పూడి కృష్ణమోహన్.. జ్యుడీషియల్ అధికారులతో జిల్లాలోని కేసులకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలుకు వచ్చి అతిథిగృహంలో ఉన్న హైకోర్టు జడ్జి కె.మన్మథరావుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించారు.
కెమెరాల కోసం లారీ లాక్కున్నారు!
● అడవిలో కెమెరాలు చోరీ అయ్యాయని వెదురుబొంగుల లారీ స్వాధీనం
● అధికారుల తీరుపై కాంట్రాక్టర్ల అసహనం
గిద్దలూరు రూరల్: అడవిలో అటవీ శాఖకు చెందిన కెమెరాలు చోరీకి గురయ్యాయని ఆ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాటిలో ఎటువంటి సంబంధం లేని ఓ బొంగుల లారీని అడ్డుకొని.. మా కెమెరాలు తీసుకువచ్చి లారీని తీసుకువెళ్లండని లారీని స్వాధీనం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. అటవీశాఖ పరిధిలో వెదురు బొంగుల కాంట్రాక్టర్ తిరుమలయ్యకు చెందిన లారీ అటవీ ప్రాంతంలోని వెదురు బొంగుల లోడును తీసుకువస్తుండగా కొత్తకోట బీటు పరిధిలోని గరిససెమూల ప్రాంతంలోకి రాగానే అటవీశాఖ అధికారులు లారీని అడ్డుకుని అటవీ ప్రాంతంలో కెమెరాలు చోరీకి గురయ్యాయని, వాటిని తీసుకువచ్చి మీ లారీని తీసుకెళ్లండని ఈ నెల 21న మండలంలోని సంజీవరాయుడుపేట అటవీ శాఖ డిపోకు తరలించారు. దీంతో వెదురుబొంగుల కాంట్రాక్టర్లు అందరూ కలిసి అటవీ ప్రాంతంలో ఎవరో ఏదో చేస్తే తమకు సంబంధం ఏంటని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయమై డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావును వివరణ కోరగా..విచారణ జరుగుతుందని, పూర్తి కాగానే లారీని పంపుతామని సమాధానమిచ్చారు.

రోడ్డుపై పడిన కోళ్లఫారం లారీ

ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్‌కుమార్

హైకోర్టు జడ్జి బొప్పూడి కృష్ణమోహన్‌కు పుష్పగుచ్చం అందజేస్తున్న జిల్లా జడ్జి ఏ భారతి