ఒంగోలు: జగనన్న విద్యాదీవెన కింద నిధులు విడుదల కాని షెడ్యూలు కులాల విద్యార్థులు తమ వివరాలను ఈనెల 25 లోగా తమ పరిధిలోని గ్రామ/ వార్డు సచివాలయాల్లో అప్‌డేట్ చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ, సాధికారత అధికారి ఎన్.లక్ష్మానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి షెడ్యూలు కులాల విద్యార్థులకు గతంలో తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తారని, ప్రస్తుతం విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇంకా 2460 మంది విద్యార్థుల బ్యాంకు ఖాతాకు ఆధార్ ఎన్‌పీసీఐ అనుసంధానం కాకపోవడం వల్ల జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల కాలేదన్నారు. విద్యార్థులు తమ బ్యాంకు వివరాలను ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో అందజేయని వారు ఈనెల 25 లోపు పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్‌చేసి తమ పరిధిలోని గ్రామ/ వార్డు సచివాలయాల్లో పోస్టల్ అకౌంట్ అప్‌డేట్ చేసుకోవాలని వివరించారు. ఎన్‌పీసీఐ అనుసంధానం అయిన విద్యార్థులకు త్వరలో విద్యాదీవెన నిధులు విద్యార్థుల ఖాతాకు జమ చేస్తారని వివరించారు. కాలేజీల యాజమాన్యం వారు ఈ విషయాన్ని గమనించి ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. ఇతర కులాలకు చెందిన ఎస్‌టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారీట వర్గాల విద్యార్థులకు గతంలో మాదిరే విద్యార్థుల తల్లుల ఖాతాకి రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యాదీవెన , జగనన్న వసతి దీవెన నిధులు.. ఎన్‌పీసీఐ ప్రకారం ఆధార్‌తో అనుసంధానం అయిన తల్లి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి ఇంకా 247 మంది తల్లులు ఎన్‌పీసీఐ ప్రకారం ఆధార్‌తో వారి బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోలేదన్నారు. ఈనెల 21న జరిగిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ సాంఘిక సంక్షేమశాఖ నిర్వహించిన సమీక్షలో షెడ్యూలు కులాల విద్యార్థుల బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేయించాలని సూచించినట్లు లక్ష్మానాయక్ వివరించారు.