
వీసీలో పాల్గొన్న పోలీసు అధికారులు
● కోర్టు ట్రయల్ కేసులపై అలసత్వం తగదు
● పోలీస్ అధికారులతో సమీక్షలో ఎస్పీ మలికా గర్గ్
ఒంగోలు టౌన్: న్యాయస్థానాల్లో వివిధ దశల్లో ఉన్న కేసుల విషయంలో అలసత్వం వహించవద్దని ఎస్పీ మలికా గర్గ్ స్పష్టం చేశారు. శుక్రవారం ట్రయల్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లపై జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులపై న్యాయస్థానాల్లో జరుగుతున్న ట్రయల్ తీరుతెన్నులు, కోర్టులో బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టడం, పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూల అమలు తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కోర్టుల్లో వివిధ దశల్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన వెంటనే సీసీ, పీఆర్సీ నంబర్లు తీసుకోవాలని, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టుల వివరాలను వెంటనే తెప్పించుకోవాలని, సాక్షులకు సకాలంలో సమన్లు అందజేయాలని స్పష్టం చేశారు. కోర్టులో బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టాలని, ముద్దాయిల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ల కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, ఎన్బీడబ్ల్యూస్‌ను సక్రమంగా అమలు చేయడంలో అలసత్వం వీడాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ(అడ్మిన్)కె.నాగేశ్వరరావు, ఏఎస్పీ(క్రైమ్) ఎస్‌వీ శ్రీధరరావు, డీఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ దేవప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్పీ మలికా గర్గ్