
గుండ్లాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈఓ పీ రమేష్
● డీఈఓ రమేష్
మద్దిపాడు: పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ పీ రమేష్ అన్నారు. మండలంలోని గుండ్లాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మద్దిపాడు కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, పైపాలెం ఎంపీపీ పాఠశాలలను శుక్రవారం ఆయన సందర్శించారు. గుండ్లాపల్లి పాఠశాలలో 7వ తరగతి విద్యార్థులను ఆయన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. పాఠశాల ఉపాధ్యాయులకు సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యనేర్పే దిశగా ఉపాధ్యాయులు ఉపక్రమించాలన్నారు. కింది తరగతుల విద్యార్థులు రాయలేకపోతున్నారని వారికి రాయడం, చదవడం ముందు నేర్పించాలని అన్నారు. కరోనా సమయంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. కింది తరగతుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి రాయడం చదవడం నేర్పించాలని డీఈవో సూచించారు. మద్దిపాడు పైపాలెం ఎంపీపీ స్కూల్‌లో విద్యార్థులతో కొన్ని పదాలు రాయించారు. వారు సక్రమంగా రాయకపోవడంతో ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయుని మందలించారు. మద్దిపాడు కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఫేర్ వెల్ కార్యక్రమానికి హాజరై పదో తరగతి విద్యార్థులకు దోస్తీ ఫౌండేషన్ ద్వారా షేక్ మహబూబ్ బాషా స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ అందిస్తున్న పరీక్షలకు అవసరమైన ప్యాడ్లు, కంపాస్ బాక్స్ పెన్ను పెన్సిల్స్ అందించారు. కార్యక్రమంలో ఆయన వెంట పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి కోటిరెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.