
ఒంగోలు అర్బన్: జిల్లాలో సేంద్రియ వ్యవసాయం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అధికారులకు సూచించారు. జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి అధ్యక్షతన ప్రకాశం భవనంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహామండలి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో అర ఎకరా నుంచి ఎకరా వరకు సేంద్రియ వ్యవసాయం కచ్చితంగా సాగయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు అందజేయాలన్నారు. పాత కార్డులు రెన్యువల్ చేసి రైతులకు పంట రుణాలు ఇప్పించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇప్పించాలని సూచించారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశుసంవర్ధక, మత్స్య శాఖలు రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు ఇప్పించాలన్నారు. రైతులను చిరుధాన్యాల సాగు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలకు తీసుకువెళ్లి దానివల్ల కలిగే లాభాలు తెలియచేయాలన్నారు. జిల్లాలో ఎక్కువగా సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆళ్ల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్‌కు సంబంధించి గ్రామాల్లో ఆర్బీకేల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ వెంటనే కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, డీఆర్‌డీఏ పీడీ బాబురావు, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ బేబిరాణి, ఉద్యానవన అధికారి గోపిచంద్, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, జిల్లా పౌర సరఫరాల అధికారి గ్లోరియా పాల్గొన్నారు.
ప్రతి ఆర్‌బీకే పరిధిలో సేంద్రియ వ్యవసాయం జరగాలి వ్యవసాయ సలహామండలి సమావేశంలో కలెక్టర్ దినేష్‌కుమార్