
వీల్స్ ఇండియాలో శిక్షణకు ఎంపికై న విద్యార్థులు
ఒంగోలు: స్థానిక డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో తొలిరోజు జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. మాండో ఆనంద్, వీల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో కలిసి సంయుక్తంగా జాబ్‌మేళాలను నిర్వహించాయి. ముందుగా డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ పీవీఎల్‌ఎన్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రతి విద్యార్థి కనీసం రెండు సంవత్సరాలపాటు శిక్షణ పొందితే ఆ తరువాత బీటెక్ చదివిన విద్యార్థికంటే మెరుగైన ఉపాధి అవకాశాలను సొంతం చేసుకునే సౌలభ్యం ఉందని చెప్పారు. కేవలం విద్యాబోధనే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. శుక్ర, శనివారాల్లో జరిగే ఈ జాబ్‌మేళాకు చైన్నెకు చెందిన మాండో ఆనంద్ కంపెనీ, తమిళనాడులో 4, ఏపీలోని సత్యవేడులో ఒక యూనిట్ కలిగిన వీల్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు రావడం శుభపరిణామమన్నారు. వీల్స్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థల్లో 600 మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అనంతరం హెచ్‌ఎల్ మాండో ఆనంద్ కంపెనీ, వీల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు వేర్వేరుగా రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాయి. హెల్ మాండో కంపెనీ 2020 , 2021, 2022 లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఎంపిక నిర్వహించింది. ఇందులో 36 మంది హాజరుకాగా వారిలో 16 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీల్స్ ఇండియా కంపెనీ మాత్రం ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న డిప్లొమా విద్యార్థులకు మాత్రమే ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 152 మంది హాజరుకాగా వారిలో 135 మందిని ఎంపిక చేసుకున్నారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ఏడాదిపాటు ట్రైనింగ్ ఉంటుందని, స్టైఫండ్ ఇస్తామన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత అభ్యర్థి సామర్థ్యాలను బట్టి శాశ్విత ప్రాతిపదికన ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్ నుంచి ఓఎస్‌డీ తిప్పేస్వామి, డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ట్రైనింగ్ అండ్‌ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్ హెచ్‌ఓడీ, ఆటో మొబైల్ విభాగం సీనియర్ లెక్చరర్ తదితరులు జాబ్‌మేళాను పర్యవేక్షించారు. శనివారం కూడా హెచ్‌ఎల్ మాండో ఆనంద్ కంపెనీ జాబ్‌మేళాను నిర్వహిస్తుందని కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు.