
డీఆర్‌ఓ శ్రీలతకు శుభాకాంక్షలు తెలుపుతున్న కలెక్టరేట్ ఏఓ, ఇతర సిబ్బంది
● బాధ్యతలు స్వీకరించిన డీఆర్‌ఓ శ్రీలత
ఒంగోలు అర్బన్: జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రామిశెట్టి శ్రీలత అన్నారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని డీఆర్‌ఓ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆమెను కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఓ) శ్రీనివాసరావు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాలు కలిసి పుష్పగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.
రేపు ఎంపీ మాగుంట రాక
ఒంగోలు: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం నగరంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని మాగుంట కార్యాలయ మేనేజర్ భవనం సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. తిరిగి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి స్థానిక తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
టీబీ వ్యాధికి అవగాహనతో చెక్
ఒంగోలు అర్బన్: టీబీ వ్యాధిపై అవగాహనతో ఉండి తగిన జాగ్రత్తలు వహిస్తే వ్యాధికి చెక్ పెట్టవచ్చని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం క్షయ నివారణ అధికారి డాక్టర్ సురేష్ అధ్యక్షతన నిర్వహించిన క్షయ అవగాహన ర్యాలీని ప్రకాశం భవనం వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ టీబీ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనల మేరకు చికిత్సాకాలంలో విధిగా మందులు వినియోగించాలన్నారు. టీబీ ముక్త భారత్ కార్యక్రమం ద్వారా వ్యాధిగ్రస్తులకు ఆరు నెలల పాటు రూ.500 పౌష్టికాహారం కోసం అందిస్తుందన్నారు. ఆర్టీపీసీఆర్, సిబినాట్ యంత్రాల ద్వారా వ్యాధి కచ్చితంగా ఏ స్థాయిలో ఉందో కూడా నిర్ధారించవచ్చన్నారు. టీబీపై అవగాహనకు మార్చి 24 నుంచి ఏప్రిల్ 13 వరకు ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తారన్నారు. డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా వైద్యులు సూచించినట్లు మందులు కచ్చితంగా వాడితే క్షయ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. ర్యాలీ ప్రకాశం భవనం నుంచి రిమ్స్ వరకు కొనసాగింది. అనంతరం రిమ్స్ గ్యాలరీలో క్షయ నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ డాక్టర్ నీరద, డీఎల్‌ఏటీ డాక్టర్ సురేష్‌కుమార్, జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాంబశివరావు, డాక్టర్ మాధవీలత, డాక్టర్ రంజిత్‌బాష, డాక్టర్ మణిబాబు, డాక్టర్ పద్మజ, డాక్టర్ జానశ్రీ, టీబీ జిల్లా కో ఆర్డినేటర్ ఎస్ రత్నకుమారి, డీపీఎం రంగారావు, డాక్టర్ జోసఫ్ శామ్యూల్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. టీబీ నివారణకు కృషి చేసిన సిబ్బందికి ప్రత్యేక సేవా పతకాలను అందజేశారు.
ఇంటర్ పరీక్షకు 1069 మంది గైర్హాజరు
ఒంగోలు: ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం–2బి, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు శుక్రవారం 1069 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగం పరీక్షలకు 22,123 మందికిగాను 21,368 మంది, ఒకేషనల్‌కు సంబంధించి 3,114 మందికిగాను 2,800 మంది హాజరయ్యారు. సింగరాయకొండ ఏపీ సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజీలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ పరిశీలించగా, రాష్ట్ర అబ్జర్వర్ రమణారెడ్డి చీరాలలోని పలు సెంటర్లను పరిశీలించారు. పరీక్షలు పూర్తి ప్రశాంతంగా జరిగాయని ఆర్‌ఐవో ఎ.సైమన్ విక్టర్ తెలిపారు.

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్