జీవనాడికి ఊపిరి

- - Sakshi

కరువు నేలను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. దుర్భిక్ష ప్రాంతాలకు జీవనాడి అయిన ఈ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు వేగవంతమయ్యాయి. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌తో సమానంగా వెలిగొండ పనులను పరుగులు పెట్టిస్తోంది. నిర్దిష్ట వ్యవధిలో పనులు పూర్తి చేసి కృష్ణా జలాలు పరుగులు తీసేలా అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు.

మార్కాపురం: ప్రకాశం, వైఎస్సార్‌, నెల్లూరు జిల్లాల్లో శాశ్వతంగా కరువు నివారించి సాగు, తాగు నీరందించేందుకు చేపట్టిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఐదు దశాబ్దాల కింద పోరాటం మొదలైంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా దీనిని పట్టించుకున్న దాఖల్లాలేవు. 1996లో చంద్రబాబు సమాధిరాయిలా శిలాఫలకాన్ని ఆవిష్కరించి గాలికొదిలేశారు. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాజెక్ట్‌ పనులకు శ్రీకారం చుట్టారు. పనులు వేగవతంగా సాగుతున్న సమయంలో వైఎస్సార్‌ అకాల మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. 2004 నుంచి వైఎస్సార్‌ ప్రభుత్వంలో రూ.1448.14 కోట్లు ఖర్చు పెట్టారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. కేటాయించిన బడ్జెట్‌ ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోయాయి.

వడివడిగా పనులు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వెలిగొండకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అరికట్టి పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించింది. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువ, ఉపకాలువలు, ఉదయగిరి ఉపకాలువ, పడమర ఉపకాలువ, టి–5 కాలువల పనులు పూర్తయ్యాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో పునరావాసం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు రూ.5,950 కోట్లు ఖర్చు చేసింది. రెండో దశ కోసం రూ.8052.10 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం, భూ సేకరణ, పునరావాసం, అటవీ భూముల కోసం ఖర్చు చేస్తున్నారు. గత ఏడాది రూ.856.15 కోట్లు కేటాయించారు.

వేగంగా పునరావాస పనులు:

ముంపు గ్రామాలైన కలనూతల వారికి ఇడుపూరు 1, 2లో, గుండంచెర్ల నిర్వాసితులకు తోకపల్లి వద్ద, సుంకేసుల గ్రామస్తులకు గోగులదిన్నె వద్ద, గొట్టిపడియ, అక్కచెరువు గ్రామస్తులకు వేములకోట వద్ద, సాయిరాం నగర్‌, రామలింగేశ్వరపురం వాసులకు ఓందుట్ల వద్ద పునరావాస పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో గొట్టిపడియ వద్ద వెలిగొండ నీటిని మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ప్రజలకు అందించేందుకు ఇన్‌టెక్‌ ట్యాంక్‌ పనులను వేగంగా చేస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌

ప్రాజెక్టు నిర్మాణం ఇలా

శ్రీశైలం ప్రాజెక్టులోని 43.58 టీఎంసీల కృష్ణానీటిని శ్రీశైలం వద్ద ఉన్న కొల్లం వాగు నుంచి 2 టన్నెల్స్‌ ద్వారా ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలోని 30 మండలాలకు కృష్ణా జలాలు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు వల్ల 4,47,300 ఎకరాలకు సాగునీరు, 15.25 మంది లక్షల మందికి తాగు నీరు అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల డ్యాంలు పూర్తి కాగా దోర్నాల మండలం కొత్తూరు వద్ద రెండు టన్నెల్‌ పనులు పూర్తికావొచ్చాయి. రెండు టన్నెల్స్‌ నిర్మాణంలో భాగంగా ఒక్కొక్క టన్నెల్‌ 18.8 కిలో మీటర్ల పొడవుతో టన్నెల్స్‌ నిర్మిస్తున్నారు. మొదటి టన్నెల్‌ పనులు పూర్తి చేయగా, రెండో టన్నెల్స్‌ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. దివంగత వైఎస్‌ఆర్‌ మహా సంకల్పంతో ప్రాజెక్టును ప్రారంభించగా 2014 నాటికి ఒకటో టన్నెల్‌ 11.50 కిలో మీటర్లు పూర్తికాగా, రెండో టన్నెల్‌ 9 కిలోమీటర్లు పూర్తయింది. 62 శాతం టన్నెల్‌ 1 పనులు పూర్తికాగా, 48 శాతం టన్నెలు 2 పనులు పూర్తయ్యాయి. 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో 1వ టన్నెల్‌కు సంబంధించి కేవలం 2 కిలో మీటర్లు మాత్రమే పనులు జరిగాయంటే ప్రాజెక్టు నిర్మాణం పై చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమౌతుంది. అధికారంలోకి వచ్చినా వైఎస్‌ జగన్‌ వెంటనే మొదటి టన్నెల్‌ పూర్తి చేయాలని ఆదేశించడంతో త్వరితగతిన పూర్తి చేశారు.

త్వరలో వెలిగొండ జలాలు:

టీడీపీ హయాంలో వెలిగొండ నిధులను పార్టీ నేతలు ఏటీఎంగా వాడుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై వారికి చిత్తశుద్ధి లేదు. వెలిగొండ ప్రాజెక్టు విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి సమీక్షలు చేస్తున్నారు. నేను, సహచర ఎమ్మెల్యేలు, మంత్రులం కలసి సీఎం వైఎస్‌ జగన్‌ను వెలిగొండ ప్రాజెక్టు కోసం కలిశాం. త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. తండ్రి వైఎస్‌ఆర్‌ హయాంలో ప్రాజెక్టు పనులు ప్రారంభించగా తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వెలిగొండ జలాలతో ఈ ప్రాంతం మరో కోనసీమ లాగా పచ్చని పైర్లతో, పాడిపంటలతో కళకళలాడుతుంది. కరువు మాటే అప్పుడు వినిపించదు.

ఊపందుకున్న వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులు జోరుగా పునరావాసం ఇన్‌టెక్‌ ట్యాంక్‌ పనుల్లో పుంజుకున్న వేగం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5,950 కోట్లు ఖర్చు

– కేపీ నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే మార్కాపురం

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top