
క్షతగాత్రుడు కుమార్
ఒంగోలు టౌన్: ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి వేగంగా వస్తున్న మరో ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం ఒంగోలు రూరల్ మండల పరిధిలోని వలేటివారిపాలెం వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. కరవది నుంచి ఇటుకల లోడుతో ఒంగోలు వెళ్తున్న ట్రాక్టర్‌ను వలెటివారిపాలెం వద్ద వెనుక నుంచి వచ్చిన మరో ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కరవది గ్రామానికి చెందిన మట్టే రమాదేవి, మట్టే అనూరాధ, మట్టే శీనమ్మ, మట్టే రాఘవేంద్రరావుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పండగ రోజు కూడా కూలీ పనులకు వెళ్లి ప్రమాదంలో గాయపడిన పేద కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని యాదవ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏడుగుండ్లపాడు వద్ద మరో యువకుడికి..
మద్దిపాడు: రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న టిఫిన్ ఆటోను బైక్ ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం ఏడుగుండ్లపాడు సమీపంలో జాతయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం రామచంద్రాపురం పట్టపుపాలెంకు చెందిన సోమాగారి కుమార్(28) బైక్‌పై గుంటూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఏడుగుండ్లపాడు సమీపంలో రాంగ్ రూట్‌లో వస్తున్న టిఫిన్ బండిని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మద్దిపాడు కానిస్టేబుల్ సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఒంగోలు జీజీహెచ్‌లో చేర్చారు. టిఫిన్ ఆటోను సీజ్ చేసి మద్దిపాడు స్టేషన్‌కు తరలించారు. యువకుడి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మద్దిపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన రాఘవేంద్రరావును పరామర్శిస్తున్న మిరియం శ్రీనివాసులు