
మఠంలో అలంకరణలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి మూలవిరాట్
జాళ్లపాలెం (కొండపి): మండలంలోని జాళ్లపాలెం గ్రామంలో శోభకృత్‌నామ ఉగాది పండుగను పురస్కరించుకుని వీరబ్రహేంద్రస్వామి తిరునాళ్లను బుధవారం దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. కోర్కెలు తీరిన భక్తులు పొంగళ్లు పెట్టుకుని దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామికి నైవేద్యం సమర్పించుకున్నారు. కోర్కెలు తీరిన కొందరు భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించుకుని స్నానాలాచరించి గుడి ముందు హోమ గుండంలో ఎండు కొబ్బరి గిన్నెలు వేసి మొక్కు తీర్చుకున్నారు. తిరునాళ్ల రోజు ఉదయం పూట భక్తులు తమ వాహనాలను, పశువులను దేవస్థానం చుట్టూ తిప్పుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పలువురు దాతలు అన్నదానం ఏర్పాటు చేశారు. పలువురు మంచినీరు, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తుల దాహం తీర్చారు. తిరునాళ్ల సందర్భంగా ఆరు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు తగిన బందోబస్తు నిర్వహించారు.
మొక్కులు తీర్చుకున్న వేలాది మంది భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యుత్ ప్రభలు