
మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి
‘స్కిల్’ కుంభకోణం
● 370 రూ. కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు ● ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకెల్లా ఇదే భారీ స్కామ్ ● దోషులను కఠినంగా శిక్షించాలన్న ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి
మార్కాపురం: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జీఓలు, నోట్ ఫైల్ తదితర అనుమతులేవీ లేకుండా రూ.370 కోట్లకు పైగా నిధులు దారి మళ్లడం వెనుక నారా చంద్రబాబునాయుడు హస్తం ఉందని ఆధారాలతో సహా బట్టబయలైందని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకెల్లా ఇది భారీ స్కామ్ అని, చంద్రబాబు ప్రోద్బలంతోనే నిధులు కొల్లగొట్టారని ఆరోపించారు. బుధవారం మార్కాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ‘స్కిల్’ కుంభకోణంలో చంద్రబాబు ప్రోద్బలంతో అప్పటి మంత్రులు, అధికారులు ఎటువంటి జీఓ, అనుమతులు లేకుండా 370 కోట్ల రూపాయలను షెల్ కంపెనీలకు కేటాయించి తిరిగి చంద్రబాబుకు చేర్చారన్నారు. నోటి మాటతో ఎవరైనా రూ.370 కోట్ల ప్రజా ధనాన్ని విడుదల చేస్తారా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌లో రూ.10 లక్షల నిధులు రోడ్లకు కేటాయించాలంటే జీఓ, బడ్జెట్ అలాట్‌మెంట్, క్వాలిటీ చెకింగ్ దగ్గర నుంచి అన్ని రకాల నిబంధనలు పూర్తయితేనే ఫైనల్‌గా బిల్లు వస్తుందన్నారు. ఇలాంటి ప్రోసీజర్స్ ఏమీ లేకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ 370 కోట్ల రూపాయల నిధులను ఎలా విడుదల చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయాన్ని శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో స్పష్టంగా వివరించారన్నారు. ప్రజలందరూ చంద్రబాబు అవినీతిని గమనించాలని కోరారు. ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులందరిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.