
సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు
● చీరాలలో ఆవిష్కరించిన వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి
చీరాల రూరల్: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ కాంస్య విగ్రహాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక చిన్నమార్కెట్ సెంటర్‌లో ఆవిష్కరించారు. ముఖ్య అతిఽథులుగా వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, స్థానిక ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కరణం వెంకటేష్‌బాబు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ పాలేటి రామారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన ఆయన మనోహర్ లోహియా ఆలోచనా విధానంలో రాజకీయ రంగంలో ప్రవేశించి ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో రక్షణ శాఖా మంత్రిగా పనిచేశారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు ఆయన చేసిన సేవలు మరులేనివన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చట్టసభల్లో మహిళలకు నామినేటెడ్ పోస్టులు 50 శాతం అందించారని, ఈ మూడున్నరేళ్ల కాలంలో 4 రాజ్యసభ స్థానాలను బీసీలకు కేటాయించారని, అలానే 14 మంది బీసీలకు ఎమ్మెల్సీలుగా అవకాశాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ములాయంసింగ్ యాదవ్‌కు భారతరత్న ఇవ్వాలని రాజ్యసభలో ప్రపోజల్ పెడతానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. చీరాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చిమటా సాంబు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ యాదవ్, బీసీ సంఘం జాతీయ నాయకుడు వాకా వెంగళరావు, తాళ్ల వెంకటేశ్వర్లు, నాయిబ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తాడికొండ నరసింహరావు, కృష్ణారావు, అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు, దేవరపల్లి బాబురావు, గవిని శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ములాయం సింగ్ యాదవ్ కాంస్య విగ్రహం