ఒంగోలు: స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 24, 25 తేదీల్లో జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన 200 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు చైన్నె కేంద్రంగా పనిచేస్తున్న ఎంఎన్‌సీ కంపెనీ హెచ్‌ఎల్ మాండో ఆనంద్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. వాహనాల విడిభాగాలు తయారు చేసే ఈ సంస్థ హ్యుందాయ్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, ఫోక్స్‌వ్యాగన్, ఆడి, కియా, సుజుకి తదితర ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.
ఎవరెవరు అర్హులంటే:
2020, 2021, 2022లో కనీసం 60 శాతం మార్కులతో పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారు, 2001 మే 1వ తేదీ తర్వాత జన్మించిన వారు జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులని సదరు సంస్థ స్పష్టం చేసింది. పురుషులైతే డీఎంఈ, డీఏఈ, డీఈఈఈ కోర్సులు, మహిళలైతే డీఎంఈ, డీఏఈ, డీఈఈఈ, డీఈసీఈ, డీఏఈఐ, డీసీఎంఈ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొంది. అభ్యర్థులు రెజ్యూమ్, ఫొటో, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు వెంట తీసుకెళ్లాలి. రాష్ట్రంలోని ఏ జిల్లా నుంచి అయినా అభ్యర్థులు హాజరుకావచ్చు. హాజరైన వారికి రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎంఏవీ రామకృష్ణ, ఆ శాఖ అధికారుల బృందం జాబ్‌మేళాను సమన్వయం చేస్తోంది. వివరాలకు 8870985062, 8985872905ను సంప్రదించవచ్చు. ఎంపికైన వారు చైన్నెలోని మాండో సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది.