
అమరావతి: చంద్రబాబు గెలిచిందేంటి.. తాము ఓడిందేంటి అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కన్నబాబు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ల సంఖ్య బలం ప్రకారం వారికి ఓ స్థానం వచ్చింది.. మా సంఖ్యా బలం ప్రకారం మాకు వచ్చాయని స్పష్టం చేశారు కన్నబాబు.
పార్టీలో ఉండి ద్రోహం చేసిందెవరో తేటతెల్లమైంది
పార్టీలో ఉండి ద్రోహం చేసిందెవరో తేటతెల్లమైందని, ఆ ఇద్దరు దుర్మార్గులెవరో అందరికీ తెలుసన్నారు కరణం ధర్మశ్రీ. రాష్ట్ర ప్రజలు తమ వైపే ఉన్నారని కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రలోభాలకు ఇద్దరు అమ్ముడుపోయారు
చంద్రబాబు ప్రలోభాలకు ఇద్దరు అమ్ముడుపోయారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఇది చంద్రబాబు పతనానికి పరాకాష్ట అని నమ్మిన వారిని మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని జోగి రమేష్ మండిపడ్డారు. అమ్ముడైనవారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు జోగి రమేష్. చంద్రబాబుని నమ్ముకుంటే రాజకీయ సమాధేనని జోగి రమేష్ ధ్వజమెత్తారు.
కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మర్రి రాజశేఖర్, బొమ్మి ఇజ్రాయిల్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, పెన్మత్స సూర్యనారాయణ రాజు, జయమంగళ వెంకటరమణలు విజయం సాధించారు. టీడీపీ తరఫున పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలిచారు.