Nizamabad: జిల్లాపై టీఆర్‌ఎస్‌ నజర్‌.. కవితకు చాన్స్‌? 

TRS Focus On Nizamabad, Source Says MLC kavitha Will Get Minister Post - Sakshi

 మరో మంత్రి పదవి దక్కనుందంటున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

కాషాయ జోరుకు కళ్లెం వేయొచ్చనే భావనలో నాయకత్వం

రంగంలోకి దిగుతోన్న ఎమ్మెల్సీ కవిత 

సాక్షి, నిజామాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మరింత పట్టు బిగించేందుకు అధికార టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది! కాషాయ జోరుకు కళ్లెం వేయడంలో భాగంగా జిల్లాకు మరో మంత్రి పదవి కేటాయించనున్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో గులాబీ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అత్యంత కీలకం. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ పోటీ ఇస్తుండగా, ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు మరో మంత్రి పదవి కేటాయిస్తే ఉమ్మడి జిల్లాలో పట్టు నిలుపుకోవడంతో పాటు ప్రత్యర్థులపై పైచేయి సాధించవచ్చనే దిశగా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే మంత్రివర్గంలో ఒకరికి చోటు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ప్రజాప్రతనిధులకు భరోసానిచ్చేలా.. 
అభివృద్ధి విషయంలో ఉమ్మడి జిల్లాను నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని కవిత రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో ప్రకటించారు. అందులో భాగంగా జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లను నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా రైతులను ప్రోత్సహించేందుకు ఆమె ప్లాన్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నేరుగా టచ్‌లో ఉండేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు భరోసా ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఎంపీ పదవి వద్దన్నది అందుకేనా..? 
గతంలో నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైన కవితకు ఉమ్మడి జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఇటీవల ఆమెకు రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం వచ్చినా వెళ్లలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగానే ఉండేందుకు మొగ్గు చూపారు. కేబినెట్‌లో బెర్త్‌ ఖాయం కావడమే అందుకు కారణమని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు బదులు కవితకు అవకాశం కల్పించడం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్‌ జిల్లాను నంబర్‌ వన్‌ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళతానని కవిత గతంలో ప్రకటించారు. టీం నిజామాబాద్‌తో పని చేస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ఉమ్మ డి జిల్లాలో కవిత తన పట్టును మ రింతగా బిగించేందుకు రంగం సి ద్ధం చేసుకున్న ట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కావాలనే తమ శాసనసభ సెగ్మెంట్లలో మెజారిటీ రాకుండా చేసి ఓటమికి కారణమైన వారి విషయమై కవిత రగిలి పోతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత మంత్రిగా వస్తే ఒకటి, రెండు సెగ్మెంట్లలో అభ్యర్థుల మార్పు ఉంటుందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద బీజేపీని ఎదుర్కొనే విషయంలో, తీవ్ర వ్యతిరేకత ఉన్న వారిని మార్చే విషయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇచ్చేలా కవిత ప్రణాళికలు తయారు చేసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.  

కవితకు చాన్స్‌? 
జిల్లా నుంచి మంత్రిమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికైన కవితకు అమాత్య పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. కేసీఆర్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ప్రశాంత్‌రెడ్డితో పాటు కుమార్తె కవిత కేబినెట్‌లో ఉంటే జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులకు మరింత బూస్టప్‌ ఇచ్చినట్లు కావడంతో పాటు జిల్లాలో పార్టీ పట్టు ఏమాత్రం సడలకుండా ఉండే అవకాశమున్నట్లు నాయత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ నివేదికల్లోనూ సీఎం కేసీఆర్‌ వద్దకు ఇదే అంశం వెళ్లినట్లు సమాచారం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top