TPCC: మరి అసంతృప్తుల పరిస్థితి ఏమిటి?

TPCC Group Members Appointed As By Caste Criteria - Sakshi

టీపీసీసీ అధ్యక్ష, కార్యవర్గాలను నియమించిన ఏఐసీసీ

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీ పదవి?

సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: అదుగో.. ఇదుగో అంటూ ఆరు నెలలుగా దోబూచులాడుతూ వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక పూర్తయింది. రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి, ఐదుగురికి వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్‌ ఉపాధ్యక్షులుగా నియమించడంతోపాటు మరో మూడు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మొత్తం కార్యవర్గం, కమిటీల కూర్పులో సామాజిక కోణాన్ని బట్టి ఎంపిక చేసింది. గతంలో పీసీసీకి నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఉండగా.. ఇప్పుడా సంఖ్యను ఐదుకు పెంచింది. గతంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఉన్న వారిలో రేవంత్‌ను అధ్యక్షుడిగా నియమించగా.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌లను తప్పించింది. అజారుద్దీన్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగిస్తూ.. కొత్తగా సీనియర్‌ నాయకురాలు గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు అవకాశమిచ్చింది.

తద్వారా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు పదవులు ఇచ్చింది. 10 మంది సీనియర్‌ ఉపాధ్యక్షుల నియామకంలోనూ సామాజిక కూర్పు పాటించింది. ఎస్సీలు ముగ్గురు, ముగ్గురు ఓసీలు, ఒక ఎస్టీ, ఇద్దరు బీసీలు, ఒక మైనార్టీ నాయకుడికి అవకాశమిచ్చింది. ఇక ప్రచార కమిటీ చైర్మన్‌గా బీసీ నేత మధుయాష్కీగౌడ్‌కు, కన్వీనర్‌గా మైనార్టీ నాయకురాలు సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీకి స్థానం కల్పించింది. ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఎస్సీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఇవ్వగా, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అప్పగించింది. 

అసంతృప్తుల పరిస్థితి ఏమిటి? 
రేవంత్‌కు పీసీసీ బాధ్యతలను అప్పగించడాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. వారిలో పలువురు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. మరికొందరు రేవంత్‌ను అడ్డుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి, గాంధీ కుటుంబం పట్ల విధేయంగా ఉండేవారికి మాత్రమే టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ పలువురు పార్టీ సీనియర్లు ఏఐసీసీకి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల నుంచి రేవంత్‌కు ఏమేర సహకారం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒకరిద్దరు నేతలు రాజీనామాలు ప్రకటించగా.. మిగతావారు ఎలా స్పందిస్తారన్న దానిపై టీపీసీసీ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే రేవంత్‌ సీనియర్లను, తనను వ్యతిరేకించిన వారిని కూడా కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 


కోమటిరెడ్డికి ఏఐసీసీ పదవి? 

టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీలో తగిన ప్రాతినిధ్యం ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలిసింది. వెంకటరెడ్డి కొన్నాళ్లు వేచిచూసే ధోరణిలోనే ఉంటారని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. 

అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ 
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలనే యోచనలో రేవంత్‌ శిబిరం ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత రాష్ట్రంలో నేతలను కలిశాక బాధ్యతల స్వీకరణ చేపట్టాలని.. ఆ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలను, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నేతలను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంతోనే కాంగ్రెస్‌ శ్రేణులకు ఊపు తేవాలని, దూకుడుగా ముందుకెళ్లాలని.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్‌ భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. 

జెడ్పీటీసీ నుంచి ఎదిగి.
నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన రేవంత్‌రెడ్డి.. 2006లో మిడ్జిల్‌ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. అనూహ్యంగా రాజకీయాల్లో ఎదిగారు. 2007–09 మధ్య ఉమ్మడి ఏపీ ఎమ్మెల్సీగా, 2009లో, 2014లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న ఆయన.. 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన రేవంత్‌.. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 


పదునైన ప్రసంగాలతో ఆకట్టుకుని.. 
కాంగ్రెస్‌ పార్టీలో చేరినప్పటి నుంచీ రేవంత్‌రెడ్డి చురుకైన పాత్ర పోషించారు. ఏఐసీసీ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్‌ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నా తనదైన రీతిలో పనిచేస్తూ ముందుకు సాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పదునైన ప్రసంగాలతో అధికార పక్షంపై విరుచుకుపడి.. ప్రతిపక్షంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. ఇటీవల రైతులకు మద్దతుగా పాదయాత్ర నిర్వహించడం.. అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా, ఇటు ప్రజల్లో ఆదరణ పెరిగింది. పలు అంశాలపై ఎన్జీటీ, కోర్టుల్లో న్యాయ పోరాటం కొనసాగించడం ఆయనకు ఆదరణ పెంచింది. మరోవైపు లోక్‌సభలో ప్రసంగాలతోనూ పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకున్నారు. రైతులకు మద్దతుగా, జమ్మూకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతానికి సం బంధించిన అనుబంధ పద్దులపై చర్చలో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. మొత్తంగా రేవంత్‌ పార్టీలో చేరి నాలుగేళ్లు కాకుండానే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకుని సంచలనంగా 
నిలిచారు.  


జానా, షబ్బీర్‌ నివాసాలకు రేవంత్‌ 
తనను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. తొలుత సీనియర్‌ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఆశీర్వదించాలని, తగిన సహకారం అందించాలని కోరారు. తర్వాత మైనార్టీ నేత షబ్బీర్‌ అలీ ఇంటికి వెళ్లి అభినందనలు అందుకున్నారు. రేవంత్‌ ఆదివారం కూడా పలువురు సీనియర్లను కలవనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఏడేళ్లలో మూడో అధ్యక్షుడు 
తెలంగాణ ఏర్పాటయ్యాక ఏడేళ్లలో పీసీసీకి మూడో అధ్యక్షుడు వచ్చారు. మొదట పొన్నాల లక్ష్మయ్య చీఫ్‌గా ఉండగా.. 2015 మార్చిలో ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయన ఆరేళ్ల మూడు నెలలు పదవిలో కొనసాగారు. తాజాగా రేవంత్‌ పీసీసీ చీఫ్‌ అయ్యారు.


‘సింహం వచ్చింది.. పులి భయపడాలి’: ఆర్జీవీ 

వివాదాస్పద, ఆసక్తికర కామెంట్లు, ట్వీట్లకు పెట్టింది పేరైన సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ టీపీసీసీ అధ్యక్ష నియామకంపై పెట్టిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది. ‘ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ సింహం రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిని చేయడం ద్వారా అద్భుత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ సింహాన్ని చూసి పులి భయపడాల్సి వస్తుంది’అని ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top