Huzurabad Bypoll: దీపావళి  తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక!

Telangana State Election Commission Clarity On Huzurabad Bypoll Schedule - Sakshi

షెడ్యూల్‌ విడుదల చేయని కేంద్ర ఎన్నికల సంఘం 

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే నిర్ణయం 

నవంబర్‌ చివరి వారంలో నిర్వహించే అవకాశం 

ఆలోగా హుజూరాబాద్‌లో దళితబంధు పూర్తికి సర్కారు కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక దీపావళి పండుగ తర్వాతే జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు.. ప్రస్తుతం హుజూరాబాద్‌ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కొద్దిరోజులుగా కురుస్తున్న వానలు, పలుచోట్ల వరదలు పోటెత్తుతుండటం, వరుసగా పండుగలు రానుండడంతోపాటు కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెలంగాణ సహా 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు ఈసీ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం లేదు..’’ అని తెలిపింది.

ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఒకటిన ఆయా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నామని వివరించింది. అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణలో ఉన్న సవాళ్లను వివరించారని.. పండుగల సీజన్‌ ముగిశాకే ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరారని వెల్లడించింది. అక్టోబర్‌ నుంచి కరోనా మూడో వేవ్‌ ప్రారంభం కావచ్చని కేంద్రం, పలు పరిశోధన సంస్థలు, సాంకేతిక నిపుణుల కమిటీలు అంచనా వేసిన విషయాన్ని తమ దృష్టికి తెచ్చారని పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతానికి ఉప ఎన్నికలు నిర్వహించవద్దని నిర్ణయించినట్టు ప్రకటించింది. 

నవంబర్‌ చివరివారంలోనే.. 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురు స్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి.. వానలు తగ్గుముఖం పడతా యి. అక్టోబర్‌ మూడో వారంలో దసరా, నవంబర్‌ తొలివారంలో దీపావళి పండుగలు ఉన్నాయి. మూడో వేవ్‌ వస్తుందని నిపుణులు హెచ్చరించిన అక్టోబర్‌ నెల కూడా అప్పటికి ముగిసి.. కరోనా పరిస్థితిపై స్పష్టత రానుంది. తర్వాత ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలై.. నవంబర్‌ చివరివారంలో లేదా డిసెంబర్‌ తొలివారంలో ఉప ఎన్ని కలు నిర్వహించే అవకాశం ఉంది. ఈటల రాజేం దర్‌ తన ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న రాజీనామా చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఆరు నెలలలోగా.. అంటే డిసెంబర్‌ 12 లోగా హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించాలి. 

ఆలోగా ‘దళితబంధు’ కొలిక్కి.. 
ఈసీ ప్రకటన మేరకు.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల షెడ్యూల్‌ రావడానికి రెండు నెలలకుపైగా సమయం ఉంది. ఆలోగా నియోజకవర్గం పరిధిలో దళితబంధు పైలట్‌ ప్రాజెక్టు అమలును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయంతో ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు, నిధుల విడుదల జరిగాయి. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి లబ్ధిదారులకు ఉపాధి ప్రక్రియ పూర్తి చేయనుంది.   

(చదవండి: KBC-13 : కేబీసీలో అనూహ్యంగా కేటీఆర్‌...ఎలాగంటే!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top