కేసీఆర్‌పై పోటీ చేస్తా.. ఓడిస్తా

Telangana: BJP MLA Etela Rajender Comments On CM KCR - Sakshi

పశ్చిమ బెంగాల్‌ సీన్‌ ఇక్కడా పునరావృతం కావడం ఖాయం

అసెంబ్లీకి రానియ్యకపోతే బీజేపీ గెలిచాకే అడుగుపెడతా: ఈటల

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్‌ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేయనున్నట్టు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. ఇప్పటికే అక్కడ క్షేత్రస్థాయి పనిని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఈటల చిట్‌చాట్‌గా మాట్లాడుతూ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించిన సీన్‌ను ఇక్కడా పునరావృతం చేస్తామనే ధీమా వ్యక్తం చేశారు.

శాసనసభా సమావేశాల్లో పాల్గొనేందుకు తనను మరోసారి అసెంబ్లీకి రానివ్వకపోతే తానే సీఎం కేసీఆర్‌ ముఖాన్ని చూడబోనని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే శాసనసభలో అడుగుపెడతానని ఈటల స్పష్టం చేశారు. త్వరలోనే బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో చేరికలుంటాయని, చేరికల కమిటీ కన్వీనర్‌గా తాను ఈ దిశలో కసరత్తు చేస్తున్నానని తెలియజేశారు.

ల్యాండ్‌పూలింగ్‌ పేరుతో అసైన్డ్‌ భూములు లాక్కుంటున్నారు...
కేసీఆర్‌ సర్కార్‌ ల్యాండ్‌పూలింగ్‌ పేరుతో అసైన్డ్‌ భూములను ప్రైయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు దళితుల నుంచి లాక్కుంటోందని ఈటల ఆరోపించారు. ఈ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ బ్రోకర్‌ లాగా తయారయ్యారని మండిపడ్డారు. గత ఎనిమిదేళ్ల పాలనలో ప్రభుత్వం కనీసం ఒక ఎకరం అసైన్డ్‌ భూమిని కూడా నిరుపేదలకు పంచలేదని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇవి చేయకపోగా గత ›ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ఎస్సీల నుంచి గుంజుకుంటున్నదని విమర్శించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top