ప్రగతిభవన్ నుంచే రాహుల్‌కు స్క్రిప్ట్

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య 31 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు ఒప్పందం: సంజయ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీఎం కేసీఆర్ నివాసమైన ప్రగతిభవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌నే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వరంగల్ సభలో చదివారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. మరి రాహుల్ నోట కేసీఆర్ పేరు రాలేదంటే దాని అర్థమేమిటని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒక్కటయ్యాయి. వారి మధ్య మాటాముచ్చట కుదిరింది.
వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుని కలసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. పొత్తు విషయం బయటపడి ప్రజల్లో వ్యతిరేకత రావడంతో బీజేపీపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలసి వ్యూహాత్మకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి’అని అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర 24వ రోజు శనివారంరాత్రి జడ్చర్ల నియోజకవర్గానికి చేరింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సంజయ్‌కి జేసీబీలతో పూలవర్షం కురిపించి స్వాగతం పలికాయి. అనంతరం నక్కలబండ తండా సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘ఏఐసీసీ భవన్, ప్రగతిభవన్, ఫాంహౌస్‌లలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలతో టీఆర్‌ఎస్ వ్యూహకర్త పీకే సమావేశమై 31 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఆ పార్టీల మధ్య పొత్తు కుదిర్చారు. దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది’అని అన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మె ల్యేలు టీఆర్‌ఎస్‌గూటికి చేరారని, బీజేపీకి చెందినవారెవ్వరూ తమ పార్టీని వీడలేదని గుర్తుచేశారు.
గతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు కలసి పోటీ చేశాయని, బీజేపీ ఎప్పుడూ ఆ పార్టీలతో కలిసి పోటీచేయలేదన్నారు. దీంతో ఆ పార్టీల నేతలు వ్యూహాత్మకంగా బీజేపీపై వి మర్శలకు దిగుతున్నారని విమర్శించారు. ‘80 శాతం హిందుత్వానికి పాటుపడతాం. ఉర్దూ మీడియంతో పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందిన వారిని అధికారంలోకి రాగానే తొలగిస్తాం’అన్నారు.
ఆ డిక్లరేషన్‌తో వచ్చేది లేదు.. పోయేది లేదు..
రాష్ట్రానికి రాహుల్ ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదని సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌తో వచ్చేది లేదు, పోయేది లేదన్నారు. తెలంగాణ ద్రోహులందరినీ కేసీఆర్ సంకనేసుకున్నారని ధ్వజమెత్తారు.