లోకేశ్‌ సాక్షిగా టీడీపీ దళిత నేత తండ్రిపైనే దాడి | TDP IN charge Bandaru Shravani Father Attacked By Party Leaders | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ సాక్షిగా టీడీపీ దళిత నేత తండ్రిపైనే దాడి

Apr 8 2023 8:19 AM | Updated on Apr 8 2023 10:27 AM

TDP IN charge Bandaru Shravani Father Attacked By Party Leaders - Sakshi

శింగనమల/గార్లదిన్నె: తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీకే చెందిన ఓ దళితుడిపై దాడికి పాల్పడ్డారు. అదీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎదుటే ఈ దాడి జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తండ్రినే టీడీపీ నాయకులు కొట్టారు. ఈ దాడిలో గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం (ఎస్సీ రిజర్వుడ్‌) నుంచి గత ఎన్నికల్లో బండారు శ్రావణి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆమెను నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా నియమించారు. కానీ పార్టీపరంగా అధిష్ఠానం పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆమెకు పోటీగా అగ్రవర్ణాలకు చెందిన ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడుతో ద్విసభ్య కమిటీని నియమించింది. ప్రస్తుతం ఇన్‌చార్జి, కమిటీ సభ్యుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. 

గురువారం రాత్రి పాదయాత్రకు వచ్చిన నారా లోకేశ్‌ను కలిసేందుకు గార్లదిన్నె మండలం మర్తాడులోని విడిది కేంద్రానికి నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు శ్రావణి, ఆమె తండ్రి బండారు రవికుమార్, తల్లి లీలావతి వెళ్లారు. అక్కడే ఉన్న ద్విసభ్య కమిటీ సభ్యుల అనుచరులు వారిని అడ్డుకున్నారు. బండారు రవికుమార్‌పై దాడి చేశారు. గాయాలపాలైన ఆయన  స్పృహతప్పి పడిపోయారు. అక్కడ ఉన్న పోలీసులు దాడిని అడ్డుకున్నారు.  రవికుమార్‌ను అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అలాగే గార్లదిన్నె సభా స్థలం వద్ద బండారు శ్రావణి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను  ద్వి సభ్య కమిటీ సభ్యుల అనుచరులు చించేశారు. టీడీపీలో ఎస్సీలకు ఏ మేరకు ప్రాధాన్యత ఉందో ఈ ఘటనలు అద్దం పడుతున్నాయని అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement