అప్పుడు లంచం తీసుకుంటూ దొరికి.. ఇ‍ప్పుడు సీఎంగా ప్రమాణం | Suvendu Adhikari 2014 Bribery Sting Video Sparks Controversy As Sworn In As West Bengal CM, Watch Inside | Sakshi
Sakshi News home page

అప్పుడు లంచం తీసుకుంటూ దొరికి.. ఇ‍ప్పుడు సీఎంగా ప్రమాణం

May 9 2026 4:16 PM | Updated on May 9 2026 9:27 PM

 Suvendu Adhikari 2014 video gors Viral now

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంతో పలువురు ఆయన పాత వీడియోలను ఇప్పుడు పోస్ట్‌ చేస్తున్నారు. గతంలో సువేందు అధికారి టీఎంసీలో ఉన్న సమయంలో నోట్ల కట్టలను లంచంగా తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆయనపై అవినీతిపరుడంటూ తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడేమో ఆయనను ఆశీర్వదిస్తూ సీఎం కుర్చిలో కూర్చోబెట్టారని పలువురు నేతలు, నెటిజన్లు విమర్శలు గు​ప్పిస్తున్నారు.

‘‘మ్యాథ్యూ శామ్యుయేల్‌ అనే పాత్రికేయుడు 2014లో తహల్కా పత్రిక తరఫున నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. సువేందు అధికారి ఓ గదిలో ఏం చేస్తున్నారన్న విషయాన్ని రహస్యంగా చిత్రీకరించి బయటపెట‍్టింది ఆ స్టింగ్‌ ఆపరేషన్‌. అందులో టీఎంసీ నేతల‍్లో పలువురు లంచాలు తీసుకుంటూ కనిపించారు. వారిలో సువేందు అధికారి కూడా ఉన్నారు. 2016 ఎన్నికల వేళ బీజేపీ ఈ వీడియోను బాగా ప్రచారం చేసింది. 

తర్వాత సువేందు అధికారి బీజేపీలో చేరిన తర్వాత తమ అధికారిక ఛానల్ నుంచి ఆ వీడియోను ఆ పార్టీ తొలగించింది. ఇప్పుడు బీజేపీకి చెందిన ఈ గొప్ప వ్యక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొత్తం బీజేపీ శ్రేణులు సువేందును పొగడటానికి ఒక్కటయ్యారు. నైతికత ఏమైంది? నైతిక సూత్రాలు ఏమయ్యాయి?’’ అంటూ ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శలు గుప‍్పించారు. సువేందు అధికారి లంచం తీసుకున్న వేళ తీసిన వీడియోను కూడా సంజయ్‌ రౌత్‌ పోస్ట్‌ చేశారు.

మీడియా సమావేశంలోనూ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు ప్రమాణ స్వీకారం చేశారని, కొన్ని సంవత్సరాల క్రితం ఆయనపై బీజేపీ పెద్ద ఎత్తున ఓ ప్రచారం చేసిందని చెప్పారు. ఆయన అవినీతిని బయటపెట్టిందని, కెమెరా ముందు లంచాలు తీసుకుంటున్న దృశ్యాలు కూడా చూపించిందని అన్నారు. సువేందు అవినీతిపరుడంటూ సామాజిక మాధ్యమాలు పోస్టులతో నిండిపోయాయని, ఈడీ దాడులు కూడా జరిగాయని తెలిపారు. అయినప్పటికీ ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.

కాగా, సువేందు అధికారి లంచాలు తీసుకుంటూ కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయారంటూ గతంలో ప్రధాని మోదీ విమర్శించిన వీడియో కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘‘2016లో కెమెరా ముందు లంచం తీసుకున్నారని సువేందు అధికారిపై మోదీ విమర్శలు చేశారు. 2021లో సువేందు బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ వాషింగ్ మెషీన్‌లో శుభ్రం చేయటానికి మోదీకి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆయనను మోదీ ఆశీర్వాదిస్తున్నారు. అవినీతిపై మోదీ పోరాటాన్ని ఎవరూ సందేహించకూడదు’’ అంటూ మరొకరు చురకలు అంటించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement