కాంగ్రెస్‌ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

Published Fri, Oct 13 2023 2:06 PM

Shocking newsTelangana Congress Senoir leader Ponnala Lakshmaiah Resigns  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు శుక్రవారం తన రాజీనామా లేఖను పంపించారు పొన్నాల.

కాంగ్రెస్‌ బీసీ నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఈ సందర్భంలో పొన్నాల ఆ లేఖలో ఆరోపించారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, బీసీలకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సొంత పార్టీలోనే  పరాయి వాళ్లమయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణాలో పార్టీని అమ్మకానికి పెట్టారంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో సీట్లను ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందంటూ  మండిపడ్డారు. 

జనగామ అసెంబ్లీ ఎన్నికల్లో  కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టిక్కెట్టు కేటాయిస్తారనే అంచనాల మధ్య పొన్నాల పార్టీకి గుడ్‌ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

బీఆర్‌ఎస్‌లో చేరిక?
మరోవైపు ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం నడుస్తోంది. కేసీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరతారని, బీఆర్‌ఎస్‌ ఆయనకు జనగామ టికెట్‌ ఆఫర్‌ చేయనుందనే తెలుస్తోంది. సాయంత్రం కల్లా ఈ అంశంపై ఓ స్పష్టత రానుంది.

నలభై ఏళ్ల బంధం.. 
1980 నుంచి పొన్నాల కాంగ్రెస్‌తో కొనసాగుతున్నారు. 1992లో పొరుగు దేశాల ప్రధానులను, విదేశీ ప్రతినిధులు పాల్గొన్న తిరుపతి కాంగ్రెస్‌ ప్లీనరీ సెషన్‌ విజయవంతం కావడంలో పొన్నాలదే కీలక పాత్ర.  ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు.

అయితే.. ఆ తర్వాతే కాంగ్రెస్‌లో పరిస్థితులపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ  పొన్నాల లక్ష్మయ్యకు చివరి నిమిషంలో టిక్కెట్టు దక్కడం గమనార్హం. గత ఎన్నికల సమయంలో.. జనగామ అసెంబ్లీ టిక్కెట్టును పొత్తులో భాగంగా ప్రొఫెసర్‌ కోదండరామ్ కు కేటాయించాలని కాంగ్రెస్ భావించింది. ఈ విషయమై పొన్నాల లక్ష్మయ్య కోదండరాంతో చర్చించారు. పార్టీ నాయకత్వంతో మాట్లాడి చివరికి టిక్కెట్టు దక్కించు కున్నారు. కానీ ఆ ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య ఓటమి పాలయ్యారు.

Advertisement
Advertisement