
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కల్లబొల్లి మాటలు కాదు.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతీ మాట అమలు చేస్తాం. బీఆర్‌ఎస్ పార్టీతో పాటు కేసీఆర్‌ను రెండు కండెంల లోతులో పాతి పెడదాం. జాతీయ పార్టీ పెట్టుకున్నామని ఖమ్మంలో మీటింగ్ ఏర్పాటుచేసి జబ్బలు చరుచుకున్న వారి కన్నా గొప్పగా బహిరంగ సభ పెట్టి మన సత్తా ఏమిటో చూపిద్దాం’అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు చెందిన ముఖ్య అనుచరులతో శుక్రవారం ఆయన ఖమ్మంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించేందుకు తనలా ఆలోచన చేస్తున్న వ్యక్తులందరినీ సమీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురితో రహస్యంగా చర్చలు జరిపానని, వారందరినీ ఏకం చేస్తున్నానని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏ పార్టీలో చేరతాననే నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. తన నిర్ణయం అనుచరుల అభీష్టం ప్రకారమే ఉంటుందని అన్నారు. ఈ నెలాఖరులోగా ఖమ్మం నడిబొడ్డున భారీ బహిరంగ సభ పెట్టనున్నట్లు పొంగులేటి చెప్పారు. అధికార మదంతో ఉన్న ప్రజాప్రతినిధులు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
కొందరు కళ్లున్నా కనపడని ధృతరాష్ట్ర పాలకుల్లా ఉన్నారని, వంశచరిత్ర అంటూ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ‘ఖమ్మంలో ఎన్‌టీఆర్ విగ్రహానికి నేను పూలమాల వేస్తే పాలతో శుద్ధి చేయిస్తావా.. ఇదేనా నీ సంస్కారం’ అంటూ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట ప్రజల దృష్టి అంతా ఖమ్మంపైనే ఉందని, ఉమ్మడి జిల్లా ప్రజలు తనకు అండగా ఉన్నారని అన్నారు. ఇప్పటివరకు జరిగిన నష్టానికి వడ్డీతో సహా తీసుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
అందరిదీ ఒకే మాట..
సమావేశానికి హాజరైన ఉమ్మడి జిల్లా నేతల నుంచి పొంగులేటి అభిప్రాయాలు సేకరించారు. ఇందులో దాదాపు 50 మందికి పైగా మాట్లాడితే వారంతా కాంగ్రెస్‌లోనే చేరాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఏ ఒక్కరు కూడా ఇతర పార్టీల పేరెత్తకుండా ముక్తకంఠంతో పొంగులేటి కాంగ్రెస్‌లోనే చేరాలంటూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మార్క్‌ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.