
రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందనే వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రగడ
ఆరుగురు మంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
ఏక్‌నాథ్ షిండే పాత్ర పోషించేందుకు మంత్రి కోమటిరెడ్డి సిద్ధమని వ్యాఖ్య
దీనిపై కాంగ్రెస్‌లో కలకలం.. ఘాటుగా ప్రతిస్పందించిన నేతలు
దమ్ముంటే టచ్ చేయాలని మంత్రి పొన్నం వ్యాఖ్య
అమిత్ షా, గడ్కరీ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలన్న కోమటిరెడ్డి
ఏలేటి ఓ జోకర్.. కాంగ్రెస్‌లోకి రానివ్వనందుకే ఆరోపణలు
నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని బీజేపీ నేతలకు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందన్న వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. రెండు జాతీయ పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు కారణమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేయాలని చూస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి 48 గంటలు చాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది.
అంతేకాదు.. ఆరుగురు మంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారనడం.. ఏక్‌నాథ్ షిండే తరహాలో ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహరించేందుకు సిద్ధమయ్యారనడం.. కోమటిరెడ్డి కేంద్ర మంత్రులు గడ్కరీ, అమిత్ షాలను కలిశారనడం కలకలం రేపింది. దీనితో ఇంతకుముందు బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందంటూ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
అధికార పార్టీ నేతలను బీజేపీ టచ్‌లోకి తెచ్చుకుంటోందంటూ ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందని, కానీ ఇక్కడ అలా సాధ్యం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఏలేటి వ్యాఖ్యలు మోదీ, అమిత్ షాల ఆలోచన తీరును తెలియచేస్తున్నాయని విమర్శించారు.
‘‘నిన్నటి వరకు బీఆర్‌ఎస్ వాళ్లు ఈ పాట పాడారు. ఇప్పుడు బీజేపీ వాళ్లు ఎత్తుకున్నారు. దమ్ముంటే టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో తెలుస్తుంది..’’ అని సవాల్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. దమ్ముంటే అమిత్ షా, గడ్కరీలను భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి తీసుకుని వచ్చి ప్రమాణం చేయించాలని, తాను కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ చేశారు.
మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఎవరూ స్పందించకపోయేసరికి ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక ఏలేటి వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరికాదని, అనవసర ఆరోపణలు పద్ధతికాదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేస్తుందన్నారు.