వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట

Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu - Sakshi

ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం 

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

పలమనేరు/కుప్పం (చిత్తూరు జిల్లా): వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేరని రాష్ట్ర పంచాయతీరాజ్, మైనింగ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లెలో మంగళవారం ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నా స్టే వచ్చిందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నూరు శాతం స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం తధ్యమన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తికి దేశంలోనే అత్యధికంగా 5 లక్షల మెజార్టీ ఖాయమన్నారు.  ప్రజల కష్టాలనే పార్టీ మేనిఫెస్టోగా చేసి వాటిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి అండగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొన్నారు. 

దేశంలోనే అత్యుత్తమ సీఎం వైఎస్‌ జగన్‌ 
రెండేళ్ల పాలనలోనే దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో మూడో సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌ మొదటి స్థానంలో నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంలో ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరితగతిన ముఖ్యమంత్రితో సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి అన్నివిధాలా నష్టం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 31 లక్షల పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాలు ఓ వైపు, అభివృద్ధి మరోవైపు, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో లక్ష్య సాధన దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న సీఎం జగన్‌ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top