ప్రజాతీర్పుతో ఓడలేదు.. కుట్ర వల్లే ఓడిపోయాం
బీజేపీతో పోరాడలేదు.. ఈసీతో పోరాటం చేశాం
విపక్ష ఇండియా కూటమి బలోపేతం కోసం కృషి చేస్తా
ఎన్నికల తర్వాత మీడియాతో మమతా బెనర్జీ సుదీర్ఘ సమావేశం
కోల్‌కతా: పదిహేనేళ్ల తృణమూల్ పరిపాలనా కోటలను ప్రజాతీర్పుతో బద్దలుకొట్టామని బీజేపీ ప్రకటించుకుంటుంటే పూర్తిగా కుట్రతోనే తమను కూలదోశారని టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీ నిప్పులుచెరిగారు. పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం తర్వాత మమత తొలిసారిగా మంగళవారం కోల్‌కతాలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో మేం బీజేపీతో పోరాడలేదు. కాషాయపార్టీ కోసం కష్టపడిన ఎలక్షన్ కమిషన్‌తో మేం పోరాడాం. ప్రజాతీర్పుతో మేం ఓడిపోలేదు. కుట్ర చేసి మమ్మల్ని తక్కువ సీట్లకు పరిమితంచేశారు. అలాంటప్పుడు నేను రాజీనామా చేయాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? నేను ఓడిపోలేదు. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామాలేఖ సమర్పించే ప్రసక్తే లేదు.
అసలు నేను రాజీనామా ఎందుకు చేయాలి? మా ఓట్లను చోరీచేశారు. ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలు జరిగాయి. దాదాపు 100 స్థానాల్లో మా గెలుపును అడ్డుకున్నారు. మా పార్టీ నైతికతను దెబ్బతీసేలా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నత్తనడకన కొనసాగించారు. బెంగాల్‌లో జరిగిన లోపభూయిష్ట ఎన్నికలను నా రాజకీయజీవితంలో ఎన్నడూ చూడలేదు. గత 22 ఏళ్లలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ చూడలేదు. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం. ఈ అధ్యాయంలో ఎన్నికలసంఘమే అసలైన విలన్. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ, ఈసీ కలసికట్టుగా ఖూనీ చేశాయి. అక్రమంగా మమ్మల్ని ఓడించే ప్రయత్నంచేశారు. ఎన్నికల సంఘం ద్వారా మమ్మల్ని ఓడించారేమోగానీ వాస్తవానికి నైతిక విజయం మాదే. వీధి పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమే. బీజేపీ అరాచకాలను ఎండగడతా’’అని మమత అన్నారు.
అంతటా దాడులు, బదిలీలు, పక్షపాతమే
‘‘ఎన్నికల ప్రక్రియ మొదలుకావడానికి ముందు నుంచే బెంగాల్ అంతటా కీలకమైన సమర్థులైన ఉన్నతాధికారులపై ఉద్దేశపూర్వకంగా ఈసీ బదిలీ వేటు వేసింది. వందలమందిని అప్రాధాన్య స్థానాలకు తరమేసింది. మా పార్టీ, మా పార్టీతో సంబంధమున్న సంస్థలపై ఈడీ అధికారులను దాడులతో ఉసిగొల్పింది. పక్షపాతధోరణితో రాజ్యాంగబద్ధ సంస్థల నిబద్ధత ప్రశ్నార్థకంగా మారింది. మాపై దాడులతో నిర్ఘాంతపోయి విపక్షాల ఇండియాకూటమి నేతలు మాకు ఫోన్‌లు చేసి సంఘీభావం తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, హేమంత్ సోరెన్ తదితర అగ్రనేతల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇకపై విపక్షాల ఇండియా కూటమి బలోపేతం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తా’’అని మమత ప్రకటించారు.
తదుపరి కార్యాచరణ వెల్లడిస్తా
‘‘నేను ఒంటరిదాన్ని కాదు. నాకు తోడుగా పార్టీ అండగా ఉంది. తదుపరి కార్యాచరణను త్వరలో వెల్లడిస్తాం. సమష్టిగా నిర్ణయించి ముందుకెళ్తాం. ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) బిల్లు అతిపెద్ద కుట్ర. ఎస్‌ఐఆర్‌తో ఏకంగా 90 లక్షల ఓట్లు తొలగించారు. తర్వాత పోరాటంచేసి 32 లక్షల ఓట్లు కలిపేలా చేశాం. తర్వాత కూడా 7 లక్షల ఓట్లను కలిపారు. కానీ ఇది ఎవరికీ తెలీదు. ఫలితాల వెల్లడి తర్వాత టీఎంసీ నేతలపై దాడులు జరిగాయి. 10 మంది సభ్యులతో నిజనిర్ధారణ కమిటీ వేస్తా. హింసాత్మక ప్రాంతాలను పర్యటిస్తా’’అని అన్నారు.
నన్నూ గెంటేశారు
‘‘ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్రబలగాలు గూండాల్లా వ్యవహరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన నన్ను కూడా నెట్టేశారు. పొట్టపై, వీపుపై నెడుతూ గెంటేశారు. మహిళగా నాతో వాళ్ల అనుచిత ప్రవర్తనతో ఎంతగానో బాధపడ్డా. ఎన్నిసార్లు అభ్యర్థించినా టీఎంసీ ఏజెంట్లను సీఆర్‌పీఎఫ్ జవాన్లు లోపలికి అనుమతించలేదు. ఫిర్యాదు తీసుకోవాల్సిన వాళ్లే ఇలా ప్రవర్తిస్తే ఎలా? జవాన్లంతా అమ్ముడుపోయారు’’అని మమత ఆరోపించారు. ‘‘పులిలా పోరాడతాం. పోరాటాన్నికొనసాగించి మళ్లీ నూతనోత్తేజంతో పైకిలేస్తాం. అధికార కుర్చిల గురించి మాకు పట్టింపులేదు. మాకు ప్రజలే ముఖ్యం. మా, మాటీ, మనుష్ కు మా వందనాలు. ప్రజాస్వామ్యద్రోహుల కారణంగా మాకు ఓటేయలేకపోయిన వారందరికీ నా క్షమాపణలు’’అని మమత అన్నారు.
బెంగాల్‌కు అమిత్ షా.. అస్సాంకు నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతల ఎంపిక ప్రక్రియను పార్టీ అధిష్టానం వేగవంతం చేసింది. ఈ ఎంపికను పర్యవేక్షించేందుకు కేంద్ర పరిశీలకులను నియమిస్తూ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే బాధ్యతను హోం మంత్రి అమిత్ షాకు అప్పగించారు. ఆయనతో పాటు సహ పరిశీలకుడిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని నియమించారు. అదేవిధంగా, అస్సాం శాసనసభా పక్ష నేత ఎంపిక కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను పరిశీలకుడిగా అధిష్టానం ఖరారు చేసింది.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయబోనని మొండికేస్తే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తదుపరి కార్యాచరణను అమల్లోకి తీసుకురావచ్చు. ఆ అధికారం రాజ్యాంగం గవర్నర్‌కు ప్రసాదించింది. శాసనసభ అనేది శాశ్వతసభ కాదు. ఐదేళ్ల కాలపరిమితి ముగియగానే శాసనసభ రద్దవుతుంది. తదుపరిఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలున్న పార్టీని కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కోరవచ్చు. పాత సీఎం రాజీనామా చేయాలని ఆదేశించవచ్చు. రాజీనామాచేయకపోతే పాత మంత్రిమండలి, కేబినెట్ మంత్రుల పదవులను గవర్నర్ రద్దుచేస్తారు.
ఒకవేళ పాత ముఖ్యమంత్రి తనకు కొత్త ఎమ్మెల్యేల్లో సరిపడా బలం ఉందని విశ్వసిస్తే బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించవచ్చు. అయితే తాజా ఎన్నికల్లో టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య సాధారణ మెజారిటీకి సరిపడా లేదు కాబట్టి బలనిరూపణలో మమత ఓడిపోవడం ఖాయం. మెజారిటీ సీట్లు సాధించిన పార్టీనే గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. మే ఆరోతేదీ (నేటి)తో టీఎంసీ ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తోంది. దీంతో రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం చూసినా టీఎంసీ పాలన ముగిసినట్లే. మమత ఆటోమేటిక్‌గా సీఎం పదవిని కోల్పోయినట్లే లెక్క. గవర్నర్ కోరనిది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం కూడా మమతకు లేదు.


