ఓట్ల తేడా 17.43 లక్షలే | MK Stalin holds a roadshow at Kolathur Assembly constituency | Sakshi
Sakshi News home page

ఓట్ల తేడా 17.43 లక్షలే

May 6 2026 4:08 AM | Updated on May 6 2026 4:08 AM

MK Stalin holds a roadshow at Kolathur Assembly constituency

మంగళవారం కొళత్తూర్‌ రోడ్‌ షోలో స్టాలిన్‌

స్వల్ప తేడాతో ఓడిపోయాం 

మాకు పడిన మొత్తం ఓట్లు 1.54 కోట్లు 

కూటమిలో సమన్వయ లోపమే కారణం 

డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ వ్యాఖ్య

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ మంగళవారం స్పందించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన టీవీకేకు, డీఎంకేకి పోలైన ఓట్లలో తేడా 17.43 లక్షలు మాత్రమేనన్నారు. ఏప్రిల్‌ 23వ తేదీన జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి 74 సీట్లు గెలుచుకోగా, ఇందులో డీఎంకేకి 59 స్థానాలు దక్కాయి. సోమవారం వెలువడిన ఫలితాలపై మంగళవారం ఎంకే స్టాలిన్‌ ఒక ప్రకటన చేశారు. టీవీకే, డీఎంకే కూటమికి ఓట్ల తేడా కేవలం 3.52 శాతం మాత్రమేనన్నారు. డీఎంకే కూటమికి 1.54 కోట్ల మంది ఓటేశారని ఆ ప్రకటనలో వివరించారు. తమకు పడిన ప్రతి ఓటూ తమపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా స్టాలిన్‌ పేర్కొన్నారు. 

డీఎంకే అనేక పర్యాయాలు అధికారం చేపట్టిందని గుర్తు చేస్తూ ఆయన, ‘మేం చూడని విజయం లేదు, ఎదుర్కోని ఓటమి లేదు’అని పేర్కొన్నారు. ‘గెలుపోటములను సమానంగా చూస్తూ, ఆశయ సాధన దిశగా ప్రయాణాన్ని కొనసాగించేవారే పార్టీ నిజమైన కార్యకర్తలు. ఈ ఉద్యమానికి ఆధారం, పునాదులు’అని పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. 

స్టాలిన్‌ రాజీనామా..ఆమోదం 
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్‌ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇన్‌ఛార్జి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌కు పంపించారు. సీఎం స్టాలిన్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్‌ అర్లేకర్‌ ఆమోదించారని అనంతరం లోక్‌భవన్‌ తెలిపింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని స్టాలిన్‌ను గవర్నర్‌ కోరారని వివరించింది. 

ఓటర్లకు కృతజ్ఞతగా ర్యాలీ 
స్టాలిన్‌ మంగళవారం ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కూటమి పార్టీలకు చెందిన వైగో, తదితరులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ నేతలెవరూ ఈ భేటీకి రాకపోవడం గమనార్హం. సాయంత్రం ఆయన సొంత నియోజకవర్గం కొళత్తూరులో తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతగా రోడ్‌షో చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంకే వర్గాలు, మద్దతుదారులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయ నిధి? 
59 మంది సీట్లను గెల్చుకున్న డీఎంకే అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్‌ ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఉదయనిధిని ప్రశ్నించగా, అధిష్టానం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement