ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్‌ సంచలన ట్వీట్‌

Minister Ktr Tweet On The Behavior Of Governors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్ల తీరుపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. రాజ్యాంగ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయంటూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేటీఆర్‌ తన ట్వీట్‌లో ప్రస్తావించారు. బీజేపీయేతర రాష్ట్రాలను చూస్తే కేంద్రం సహాయ నిరాకరణ, ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన విమర్శించారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య విభేదాల నేపథ్యంలో చాలాకాలం నుంచి రాజ్‌భవన్‌లో పెండింగ్‌ పడిన బిల్లుల వ్యవహారంలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. మూడు సాధారణ బిల్లులపై ఆమోదముద్ర వేశారు. కీలకమైన యూనివర్సిటీల నియామక బోర్డు, అటవీ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం కోసం నిలిపివేశారు.

మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం తిప్పిపంపారు. మరింత పరిశీలన అవసరమంటూ ఇంకో రెండు బిల్లులను రాజ్‌భవన్‌లోనే అట్టిపెట్టుకున్నారు. మొత్తంగా గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఇటీవలి వరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులకు సంబంధించి.. రాజ్‌భవన్‌ ఇచ్చిన వివరాలను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సోమవారం సుప్రీంకోర్టుకు అందజేశారు.  

మరోవైపు, చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు, తీర్మానాలపై ఆమోదముద్ర వేసేందుకు గవర్నర్‌కు కాల పరిమితి నిర్ణయించాలని రాష్ట్రపతిని, కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. డీఎంకే ప్రభుత్వం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
చదవండి: తమిళనాట హైలైట్‌ ట్విస్ట్‌.. స్టాలిన్‌ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top