పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 15 ఏళ్ల పాలన ముగిసిపోయింది.. బీజేపీ నుంచి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. అంటే మమతా బెనర్జీ మాజీ సీఎం అయినట్లే కదా. కానీ తాను సీఎం పదవికి రాజీనామా చేయనంటూ పట్టుబట్టుకుని కూర్చున్న మమతకు మాజీ అనిపించుకోవడం ఇష్టం లేనట్లు ఉంది. అందుకే తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో ‘మాజీ సీఎం’ అని కాకుండా కొత్త భాష్యం చెప్పారు. 15,16,17 విధాన సభలకు ముఖ్యమంత్రి అంటూ కొత్తగా ట్యాగ్ చేసుకున్నారు మమతా.
దీనివల్ల కలిసొచ్చేది ఏమీ లేకపోయినా, ఇలా చేయడం మాత్రం చర్చనీయాంశమైంది. ఆది నుంచి తాము నైతికంగా ఓడిపోలేదని, బీజేపీనే కుట్ర చేసి ఓడించిందని వాదిస్తూ వస్తున్నారు మమతా. దానిలో భాగంగా సీఎం పదవికి రాజీనామా కూడా చేయనని కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే శనివారం(మే 9వ తేదీ) ఉదయం 11 గంటల వరకూ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించలేదు. కాకపోతే ఆపై తన ‘ఎక్స్’ అకౌంట్‌లో మాత్రం స్వల్ప మార్పులు చేసుకున్నారు.
మస్క్ జోక్యం చేసుకోవాలి..
దీనిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ‘ఎక్స్’ ప్రధాన యజమాని ఎలాన్ మస్క్ జోక్యం చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆమె ప్రొఫైల్ బయోను మస్క్ మార్చాలని కోరుతున్నారు. ఆమె అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని మరికొందరు అంటున్నారు
.


