తొలుత డిమాండ్‌ చేసి.. ఆ తర్వాత ప్లేట్‌ ఫిరాయించి

Kommineni Srinivasa Rao Comments On TDP And Jana Sena Double Game - Sakshi

కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును జత చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీంతో గత కొంతకాలంగా ఈ విషయంలో ఏర్పడిన సందిగ్ద పరిస్థితి తొలగిపోయిందని అనుకోవచ్చు. దేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు గడించిన రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు కూడా వివాదం అవుతుందని ఎవరూ ఊహించలేరు. బహుశా స్థానిక సామాజిక పరిస్థితులు, రాజకీయ కారణాలతో ఇలా జరిగి ఉండవచ్చు. ఇందులో రాజకీయ పార్టీలు తమ వంతు ఆజ్యం పోశాయి. చివరికి వ్యవహారం ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఇంటిని దగ్దం చేసేవరకు వెళ్లింది. 

ప్రభుత్వం అమలాపురంలో జరిగిన హింసాకాండను అదుపు చేసినప్పటికి, కొంత డామేజీ జరిగిందని చెప్పవచ్చు. కోనసీమ ప్రాంతం పాడి,పంటలతో , గోదావరి జలాలతో సస్యశ్యామలంగా ఉండే ప్రదేశం. అక్కడ మొదటి నుంచి షెడ్యూల్ కులాలవారు అదిక సంఖ్యలో నివసిస్తున్నారు. దాని కారణంగానే అమలాపురం లోక్ సభ నియోజకవర్గం పరిదిలో అమలాపురం, రాజోలు, గన్నవరం  మూడు అసెంబ్లీ స్థానాలు రిజర్వుడ్ కేటగిరిలో ఉన్నాయి. అమలాపురం లోక్ సభ కూడా రిజర్వుడు నియోజకవర్గమే. 

అంతకుముందు రిజర్వుడ్ గా ఉన్న ముమ్మడివరం డిలిమిటేషన్ లో జనరల్ సీటు అయింది. ఏపీ ప్రభుత్వం జిల్లాల విభజన చేసినప్పుడు కోనసీమ ప్రాంత ప్రజల కోరిక మేరకు అమలాపురం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటైన కొత్త జిల్లాకు కోనసీమ పేరును ప్రకటించింది. కాని ఆ తర్వాత ఆ జిల్లాకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ మొదలైంది. ఆయా ప్రజా సంఘాలు ఈ డిమాండ్ తో ఆందోళనలు సాగించగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ డిమాండ్ ను ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు పెట్టేవరకు పోరాటం జరుగుతుందని ప్రకటించారు. 

అలాగే మరో విపక్ష పార్టీ అయిన జనసేన స్థానిక నేతలు కూడా అంబేద్కర్ జిల్లా ఏర్పాటుకు ధర్నాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముమ్మడి వరం ప్రాంతానికి పర్యటనకు వెళ్లినప్పుడు ఆయా సంఘాలవారు, రాజకీయ నేతలు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును ఖరారు చేయాలని కోరారు. అందుకు ఆయన ఆమోదం తెలిపి కోనసీమ పేరును యధాతధంగా ఉంచుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును జతచేశారు.ప్రభుత్వం ఈ డిమాండ్ ను ఆమోదించదని అనుకున్నారేమో తెలియదుకాని, రాజకీయాల కోసం టీడీపీ, జనసేనలు వెంటనే ప్లేట్ ఫిరాయించాయి. కొన్ని సంఘాలు కూడా దీనికి తోడయ్యాయి. 

ఆ డిమాండ్ పై వారు శాంతియుతంగా నిరసనలు చెబితే ఎవరూ అభ్యంతరం చెప్పనవసరం లేదు.కాని సడన్ గా అవి హింసాత్మకంగా మారి ఏకంగా మంత్రి విశ్వరూప్ ఇంటిని, ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ ఇంటిని దుండగులు దగ్దం చేసేంతవరకూ వెళ్లాయి. ఈ ఘటనతో రాష్ట్రం అంతా నిర్ఘాంతపోయింది.అంబేద్కర్ పేరు పెట్టాలని తొలుత డిమాండ్ చేసిన విపక్షాలు ఆ తర్వాత ప్లేట్ పిరాయించి , అదికార వైసీపీనే కులచిచ్చు పెట్టిందని ,కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ చేసిన హత్యకేసును డైవర్టు చేయడానికి జిల్లా కు అంబేద్కర్‌ పేరు పెట్టారని ఆరోపించడం ఆరోపించారు. అంతే తప్ప అంబేద్కర్ పేరు ఉండాలో, వద్దో అన్నదానిపై చంద్రబాబుకాని, పవన్ కళ్యాణ్ కాని ఒక్క ముక్క మాట్లాడలేదు. 

తెలంగాణ అంశంలో మాదిరే చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం పాటించినట్లుగానే ఇక్కడ కూడా వ్యవహరించారు. అయినా ప్రభుత్వం నిర్దిష్ట నిబందనలు పాటించి,నెల రోజుల గడువు తో ప్రజాభిప్రాయం తీసుకుని చివరికి క్యాబినెట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్డడానికి ఓకే చేసింది.ఒకవేళ పొరపాటున అంబేద్కర్ పేరును ఇప్పుడు వెనక్కి తీసుకుని ఉంటే ప్రభుత్వానికి అది మరింత పెద్ద సమస్య అయి ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత, వివిధ వర్గాలు ఆందోళనకు దిగేవి. అయితే అమలాపురం ఏరియాలో కాపు, ఎస్సి, బిసి సామాజికవర్గాల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల అక్కడ అంబేద్కర్ పేరుకు కొందరు వ్యతిరేకించారే తప్ప,ఎవరికి అంబేద్కర్ పట్ల గౌరవడం లేక కాదని చెప్పాలి. నిజానికి అంబేద్కర్ వాదానికి ఆంద్రప్రదేశ్ లో బలమైన కేంద్రంగా కోనసీమ ప్రాంతం ఉందన్న విషయం చరిత్ర తెలియచెబుతుంది. 

అంబేద్కర్ మొదట ఇండిపెండెంట్ లేబర్ పార్టీని, ఆ తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ను, తదుపరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ను స్థాపించారు. రిపబ్లిక్ పార్టీ పూర్తిగా రూపొందడానికి ముందుగానే ఆయన కన్నుమూశారు.కాగా తొలి ప్రధాని జవహర్ లాల్ కోరిక మేరకు తొలి క్యాబినెట్ లో న్యాయశాఖ మంత్రిగా కూడా బాద్యతలు తీసుకున్నారు. తదుపరి ఎన్నికల రాజకీయాలలో ఆయన రాణించలేకపోయినా, సిద్దాంత రాజకీయాలలో మహాత్మాగాందీ తర్వాత అంబేద్కర్ మాదిరి దేశ వ్యాప్తంగా బలమైన ముద్ర వేసుకున్న నేత మరొకరు లేరంటే అతిశయోక్తికాదు. పలు రాష్ట్రాలలో ఆయన పేరుతో జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. కాగా 1952 లో మదరాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంద్ర ప్రాంతంలో షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఒక సీటును గెలుచుకుంది కూడా కోనసీమ ప్రాంతంలోనే కావడం విశేషం. 

అమలాపురం ద్విసభ్య నియోజకవర్గం లో బి.అప్పలస్వామి అనే నేత ఈ ఫెడరేషన్ తరపున గెలుపొందారు. తదుపరి 1967లో అల్లవరం రిజర్వుడ్ నియోజకవర్గంలో రిపబ్లికన్ పార్టీ పక్షాన బి.వి.రమణయ్య అనే దళిత నేత గెలుపొందారు. ఆంద్రప్రాంతం నుంచి ఈ పార్టీ తరపున ఈయన ఒకరే గెలిచారు. దీనిని బట్టి అక్కడ అంబేద్కర్ కు ఉన్న ప్రాధాన్యత, ప్రాచుర్యం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి విశిష్టత ఉన్న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని అంతా స్వాగతించాలి. కాని అక్కడ ఉన్న కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా కొన్నివర్గాలు వ్యతిరేకించాయి. అంబేద్కర్ పేరు పెడితే కోనసీమ ప్రాశస్థ్యం పోతుందని వీరు ప్రచారం చేశారు. 

అయితే జిల్లాకు కోనసీమ పేరు కూడా ఉన్న విషయాన్ని గుర్తించాలి. ఏదో ఒక వర్గం మీద ద్వేషంతో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఒక భారత ప్రముఖుడిని అగౌరవపరిచే విధంగా ఎవరూ వ్యవహరించకూడదని చెప్పాలి. కొందరు సృష్టించిన హింసాకాండ కు బాద్యులైన కొన్ని వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో అత్యధిక శాతం టిడిపి, జనసేన కార్యకర్తలు,స్థానిక నేతలే ఉన్నారు. 

వారు ఇప్పుడు కేసులలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. వెనుక ఉన్న రాజకీయ పార్టీల పెద్ద నేతలు అంతా సేఫ్ గానే ఉన్నారు.ఆ విషయాన్ని ఇలాంటి గొడవలలో పాల్గొన్నవారు గుర్తించాలి. అంబేద్కర్ పేరు కొనసాగించడం వల్ల వైసిపికి రాజకీయంగా ఆ ప్రాంతంలో కొంత నష్టం జరగవచ్చని కొందరు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కాని, ఒకవేళ అంబేద్కర్ పేరు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గితే దేశం అంతటా పెద్ద చర్చ అయ్యేది. రాష్ట్రం అంతటా దీని ప్రభావం పడేది. మళ్లీ ఇవే విపక్షాలు ఆ పరిస్థితిని తమ అడ్వాంటేజ్ కు వాడుకునే యత్నం చేసేవి. ఈ రాజకీయాలు ముఖ్యమంత్రి జగన్ కు తెలియనివి కావు. అందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ముందుకు వెళ్ళింది. కనుక అన్ని వర్గాలు ఈ రాద్దాంతాన్ని ఇంతటితో ముగించాలని కోరుకుందాం. 


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top